
- ‘ఇదేం రాజ్యం.. కంచెల రాజ్యం’ అంటూ నినాదాలు
- మీడియా పాయింట్‌కు వెళ్లనివ్వలేదని మార్షల్స్‌తో వాగ్వాదం
- సభ జరిగే టైమ్‌లో అనుమతి లేదని చెప్పినా వినకుండా నినాదాలు
హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ఎమ్మెల్యేలు ధర్నా చేశారు. బుధవారం సభలో కేసీఆర్, కడియం శ్రీహరిని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. వాళ్లు మీడియా పాయింట్వైపు వెళ్తుండగా మార్షల్స్ అడ్డుకున్నారు. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో మీడియా పాయింట్వద్ద మాట్లాడటానికి అనుమతి లేదని చీఫ్ మార్షల్ చెప్పారు. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. తమను మీడియా పాయింట్‌కు వెళ్లనివ్వాలని డిమాండ్ చేశారు. హరీశ్‌రావు, కేటీఆర్, కడియం శ్రీహరి, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి తదితరులు అక్కడే బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘ఇదేనా ప్రజాపాలన.. పోలీస్‌రాజ్యం.. కంచెల రాజ్యం’ అంటూ నినాదాలు చేశారు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, బయట కూడా మాట్లాడనివ్వరా? అని ప్రశ్నించారు. అరగంటకు పైగా అసెంబ్లీ ఆవరణలో బైఠాయించిన ఎమ్మెల్యేలు, అక్కడి నుంచి తెలంగాణ భవన్‌కు వెళ్లారు.
మా గొంతు నొక్కుతున్నరు : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
అసెంబ్లీలోకి కంచెల పాలన తెచ్చి తమ గొంతు నొక్కుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్నారు. సభలో సీఎం రేవంత్, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని.. వాటిని రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ చెప్పలేని భాషలో మాట్లాడుతున్నారని, అవి రికార్డుల్లోకి వెళ్తున్నాయని కడియం శ్రీహరి అన్నారు. వాటిని రికార్డుల నుంచి తొలగించాలని తాము కోరుదామంటే, స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్నారు. సీఎం మాట్లాడుతున్న భాషకు దీటుగా తాము కూడా బదులివ్వగలమని, కానీ పార్లమెంటరీ సంప్రదాయాలపై తమకు గౌరవం ఉందని చెప్పారు. ప్రతిపక్ష నేతపై సీఎం దిగజారి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. అసెంబ్లీ నడుస్తుండగా మీడియా పాయింట్వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడొద్దనే నిబంధన ఏదీ లేదని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం కావాలనే తమ గొంతు నొక్కుతోందని మండిపడ్డారు. సెక్రటేరియట్లో రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని అన్నారు.