రామాయంపేట/సిద్దిపేట, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో తెలంగాణను దోచుకుందని, కాంగ్రెస్ ఎన్నికల హామీలు నెరవేర్చలేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.
మెదక్ జిల్లా రామాయంపేట, సిద్దిపేట జిల్లా దుబ్బాక గురువారం మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటికీ పేట అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 26 నెలలు గడిచినా ఎన్నికల హామీల్లో ఒక్కటైనా అమలు చేయలేదన్నారు.
బీజేపీ పాలనలో 12 ఏళ్లలో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చామన్నారు. పేదలకు ఉచిత వైద్యం కోసం కేంద్రం ప్రవేశపెట్టిన పథకాన్ని తెలంగాణలో అమలు చేయకుండా గతంలో కేసీఆర్, ప్రస్తుతం రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నారని విమర్శించారు. పంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతోందని, రాష్ట్ర ప్రభుత్వం పైసా ఖర్చు చేయడం లేదని దుయ్యబట్టారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిని కేసీఆర్ కుమార్తె కవితే బయటపెడుతోందని వ్యాఖ్యానించారు.
మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, 2009కు ముందు రామాయంపేట నియోజకవర్గంగా ఉండేదని, తర్వాత రద్దు చేసి అన్యాయం చేశారన్నారు. పేటను తిరిగి నియోజకవర్గంగా చేయడం బీజేపీతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
