- సూసైడ్ చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారమివ్వాలి : వద్దిరాజు రవిచంద్ర
న్యూఢిల్లీ, వెలుగు: పరీక్ష అంటే కేవలం ప్రశ్నాపత్రం కాదని, అది విద్యార్థి జీవిత లక్ష్యమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర అన్నారు. అలాంటి పరీక్షల్లో ప్రశ్నాపత్రాలు లీక్ కావడం, అక్రమాలు జరగడం యువత నమ్మకాన్ని దెబ్బతీయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన రాజ్యసభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వద్దిరాజు మాట్లాడుతూ.. పేపర్ లీకేజీలు చట్టాన్ని ఉల్లంఘించడంతో పాటు దేశ యువత నమ్మకాన్ని దెబ్బతీస్తాయని తెలిపారు.
ప్రభుత్వం తెచ్చిన సవరణ బిల్లుకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.బిల్లులో శిక్షలు పెంచడం, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, రెండు నెలల్లో దర్యాప్తు, మూడు నెలల్లో విచారణ పూర్తి చేయడం, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం వంటి అంశాలు అభినందనీయమని రవిచంద్ర పేర్కొన్నారు. అయితే, పేపర్ లీక్ జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడంపైనే కాకుండా.. అసలు లీకేజీలు జరగకుండా ముందస్తుగా ఎలా అడ్డుకోవాలనే దానిపై కూడా కేంద్రం దృష్టి పెట్టాలని సూచించారు.
ప్రధాని మోదీ గతంలో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతోనే యువత వీధుల్లోకి వచ్చిందని తెలిపారు. పేపర్ లీకేజీల వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన నష్టపరిహారంతో పాటు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే, ఆందోళనల సమయంలో పోలీసుల లాఠీచార్జీ, టియర్ గ్యాస్, పెల్లెట్లతో గాయపడిన విద్యార్థుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రవిచంద్ర కోరారు
