- డ్రగ్ టెస్టులకు రావాలని కాంగ్రెస్ సవాల్
- అనుచరులతో కలిసి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
ఎల్బీనగర్, వెలుగు: బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య నడుస్తోన్న ‘డ్రగ్స్ వార్’ ఉగాది పండుగ రోజున తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. బుధవారం యూత్ కాంగ్రెస్ నాయకులు డ్రగ్స్ టెస్ట్‌కు రావాలంటూ బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరిన నేపథ్యంలో గురువారం ఎల్బీనగర్‌లోని మహనీయుల విగ్రహాల వద్ద ఇరు పార్టీల నేతలు చేరుకున్నారు. తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి పాల్గొని డ్రగ్స్ టెస్ట్‌కు సిద్ధమని ప్రకటించారు.
ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కూడా సవాల్ స్వీకరించి తన అనుచరులు, మాజీ కార్పొరేటర్లు, నాయకులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. మాజీ కార్పొరేటర్ భవానీ ప్రవీణ్ కుమార్ సహా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు రావడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎల్బీనగర్ ఏసీపీ ఎ.కృష్ణయ్య గౌడ్ పోలీసు బలగాలతో అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అభివృద్ధిలో పోటీ పడలేకనే..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధిలో పోటీ పడలేక కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలకు దిగుతున్నారని విమర్శించారు. తాము డ్రగ్ టెస్ట్‌కు సిద్ధంగా వచ్చామని, అయితే పోలీసులను అడ్డుగా పెట్టుకుని తమను విగ్రహాల వద్దకు వెళ్లనీయలేదని ఆరోపించారు. సవాళ్లు విసిరి వాటికి సమాధానం చెప్పకుండా వెనక్కి తగ్గడం కాంగ్రెస్ వైఫల్యమని, తాము ఎప్పుడైనా డ్రగ్ టెస్ట్‌కు సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు.
