- 14 లక్షల మంది స్టూడెంట్స్‌కు వెన్నుపోటు
- ‘జీవో 7’ను వెనక్కి తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ ఓపెన్ లెటర్
- కాంగ్రెస్ తెచ్చిన పథకానికే తూట్లు పొడుస్తున్నరు
- 30 నెల్లలో మూడు పైసలు వెయ్యలేదు.. నేరుగా స్టూడెంట్లకే ఇస్తమంటే ఎవరు నమ్ముతరని కామెంట్
హైదరాబాద్, వెలుగు: ‘‘రెండున్నరేండ్ల అసమర్థ పాలనతో విద్యావ్యవస్థను సీఎం రేవంత్కుప్ప కూల్చి పాపం మూటగట్టుకున్నారని, ఇప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రద్దు చేసేందుకు కుట్ర పన్నుతూ విద్యార్థులకు వెన్నుపోటు పొడుస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్అయ్యారు. రాష్ట్రంలోని 14 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు అండగా ఉండే ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని రద్దు చేసేందుకే సర్కారు ‘జీవో 7’ తెచ్చిందన్నారు. ఆదివారం ‘జీవో 7’ను వెనక్కి తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ‘గడిచిన 30 నెల్లలో మూడు పైసలు కూడా విడుదల చేయని కాంగ్రెస్ప్రభుత్వం.. ఇప్పుడు విద్యార్థుల ఖాతాల్లో నేరుగా డబ్బులు వేస్తామంటే ఎవరు నమ్ముతారని ఫైర్అయ్యారు. ఫీజు రియింబర్స్‌మెంట్‌ను రద్దు చేసేందుకే ‘జీవో 7’ తీసుకొచ్చినట్లు అర్థమవుతుందన్నారు. ఈ జీవో వచ్చిన నాటి నుంచి విద్యార్థులకే కాకుండా లక్షలాది మంది నిరుపేద తల్లిదండ్రులకూ కంటి మీద కునుకు కరువైందన్నారు. ఇప్పటికే గురుకుల వ్యవస్థను పూర్తిగా కుప్పకూల్చడంతో.. 142 మందికిపైగా చందమామల్లాంటి పిల్లలు తనువు చాలించారని పేర్కొన్నారు. కనీసం సరైన భోజనం కూడా కల్పించలేని చేతగాని సర్కారు వల్ల ఇప్పటికీ వేలాది మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతూనే ఉన్నారని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంచి ఉద్దేశంతో తెచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఆ తర్వాత కేసీఆర్ కొనసాగించారని, కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పథకానికి గ్రహణం పట్టిందని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అమలు చేసిన ఫీజుల పథకానికి తూట్లు పొడవడం సిగ్గుచేటని విమర్శించారు.
విద్యార్థుల భవిష్యత్‌కు పెట్టుబడిగా చూడాలి..
విద్యకోసం ప్రభుత్వాలు చేసే ఖర్చును విద్యార్థుల భవిష్యత్‌కు పెట్టుబడిగా, బాధ్యతగా చూడాలే తప్ప.. భారంగా భావించి చేతులు దులుపుకోవడం సిగ్గుచేటని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు తీసుకున్నఈ నిర్ణయం వల్ల అత్యధికంగా నష్టపోయేది బడుగు, బలహీనవర్గాల పిల్లలేని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,500లకు పైగా నడుస్తున్న ఉన్నత విద్యాసంస్థలకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఒక్క పైసా చెల్లించకుండా రెండున్నరేళ్లుగా తీవ్ర వేధింపులకు గురి చేశారన్నారు. బాకీల చెల్లింపు విషయంలో వన్ టైమ్ సెటిల్ మెంట్ పేరిట కొంతకాలం, ట్రస్ట్, టోకెన్ల పేరిట ఇంకొంత కాలం, కమిటీల పేరిట మరికొన్ని రోజులు మభ్యపెట్టారని ఆయన ఫైర్ అయ్యారు. బకాయిలు భారీగా పేరుకుపోవడంవల్ల కళాశాలలు నడపలేక యాజమాన్యాలు బంద్ పాటిస్తే.. విజిలెన్స్ దాడులు చేయించి కాలేజీలపై బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పారు. రూ.1,207 కోట్లు విడుదల చేస్తూ ఇచ్చిన టోకెన్లకు ఇప్పటికీ దిక్కులేదన్నారు. 2026–27 విద్యాసంవత్సరానికి తెచ్చిన మార్గదర్శకాలన్నీ.. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని శాశ్వతంగా సమాధి చేసే మరణశాసనాలుగానే కనిపిస్తున్నాయన్నారు. రెండున్నరేళ్లుగా ఫీజు రీయింబర్స్ మెంట్ బాకీల వల్ల కాలేజీల్లో సర్టిఫికెట్లు ఇరుక్కుపోయి విద్యార్థులు పడుతున్న అవస్థలకు లెక్కే లేదని, విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజుల బారాన్ని మోపి, వారిని అప్పులు పాలు చేసే సర్కారు కుట్రలను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తే లేదని అన్నారు. అలాగే రూ.10 వేల కోట్ల బకాయిలు ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్నే ప్రభుత్వం నేటికీ చెప్పకపోవడం ప్రభుత్వ నయవంచన విధానాలకు నిదర్శనమని, రూ.3.75 లక్షల కోట్ల అప్పులు చేసినా ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలకు మాత్రం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం దుర్మార్గం కాకపోతే మరేంటి అని ఆయన నిలదీశారు
