- ఇప్పుడు బాధపడుతున్నరు: కేటీఆర్
- కాంగ్రెస్ అడ్డదారిన గద్దెనెక్కింది.. దేశమంతా వదిలించుకున్న దరిద్రం రాష్ట్రానికి పట్టింది
- వడ్డించిన విస్తరిలాంటి రాష్ట్రాన్ని రేవంత్ కుక్కలు చింపిన విస్తరి చేసిండు
- పుష్కర తెలంగాణ.. ముష్కరుల పాలైందని కామెంట్
- తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్‌పై చిల్లర ప్రచారాలు చేసి కాంగ్రెస్ పార్టీ అడ్డదారిలో గద్దెనెక్కిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఆ పార్టీ 25 ఏండ్లు వెనక్కి నెట్టిందని ఆరోపించారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం కాంగ్రెస్ అని, దేశమంతా వదిలించుకున్న ఆ దరిద్రం తెలంగాణకు పట్టిందని వ్యాఖ్యానించారు. ప్రజలు కాంగ్రెస్‌ను అమాయకంగా నమ్మి గెలిపించారని, ఇప్పుడు నిజం తెలుసుకొని బాధపడుతున్నారని అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పుష్కర తెలంగాణ రాష్ట్రం ముష్కరుల పాలవుతున్నదని, తెలంగాణ తల్లి కిరీటాన్ని, వడ్డాణాన్ని కాంగ్రెస్ పార్టీ దొంగిలించుకుపోతున్నదని అన్నారు. కష్టపడి సాధించిన తెలంగాణను కాపాడుకోవడమే లక్ష్యంగా అందరూ మరో ప్రజా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వడ్డించిన విస్తరిలాంటి రాష్ట్రాన్ని రేవంత్‌రెడ్డి కుక్కలు చింపిన విస్తరిగా మార్చేశారని అన్నారు. టర్మ్‌లో సగం సమయం గడిచినా రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. అన్ని రంగాల్లో కుప్పకూల్చారు..రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ కుప్పకూల్చారని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్‌ను బద్నాం చేయాలన్న ఉద్దేశంతో సాగునీటి ప్రాజెక్టుల మీద కాంగ్రెస్ పగబట్టిందని, కృష్ణా –గోదావరి జలాలను రేవంత్ తన గురువుకు సంతర్పణ చేసేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు.
పుష్కర తెలంగాణ నిష్ఫలంగా మారింది
రాజన్న సిరిసిల్ల: పుష్కర తెలంగాణ కాంగ్రెస్ హయాంలో నిష్ఫల తెలంగాణగా మారిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణను కేసీఆర్ బంగారు పల్లెంలో పెట్టి కాంగ్రెస్‌కు అప్పజెప్పితే తెలంగాణను తిప్పల తెలంగాణగా మార్చారన్నారు. యూరియా కావాలంటే చెప్పులు లైన్లో పెట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పారు. సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో పలువురు బీఆర్‌ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా జరిగిన మీటింగ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, 4 సార్లు రైతు బంద్ ఎగ్గొట్టిన రేవంత్‌రెడ్డిని రైతులు అసహ్యించుకుంటున్నారని అన్నారు. ధాన్యాన్ని కొనాలని రైతులు ఆఫీసర్ల కాళ్ల మీద పడుతున్నారని, కాళ్ల మీద పడొద్దని.. కాలర్ పట్టుకొని నిలదీయాలన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ను ప్రైవేటీకరణ చేసేందుకు సర్కార్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేకుండా ఇక్కడ మాత్రమే రైతు డిస్కంలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. మోటర్లకు మీటర్లు పెట్టేందుకు, ప్రైవేట్ వాళ్లకు కరెంట్‌ను అప్పజెప్పేందుకు సర్కారు కుట్ర చేస్తోందని మండిపడ్డారు.
