బుమ్రాకు ఏమైంది?..బౌలింగ్ లో పదునేది?

బుమ్రాకు ఏమైంది?..బౌలింగ్ లో పదునేది?

1/79, 1/73, 0/50, 0/64, 0/53, 0/38, 1/32, 0/50.. ఇవీ ఈ ఏడాది వన్డేల్లో  ఇండియా ప్రధాన పేసర్‌‌‌‌‌‌‌ జస్‌‌ప్రీత్‌‌ బుమ్రా బౌలింగ్‌‌ ఫిగర్స్‌‌. ఎనిమిది ఇన్నింగ్స్‌‌ల్లో కలిపి తీసింది మూడు వికెట్లే. యావరేజ్‌‌ 146.33 అయితే స్ట్రయిక్‌‌ రేట్‌‌152.3. ఈ లెక్కలు బట్టే వన్డేల్లో బుమ్రా ఎంతగా ఇబ్బంది పడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. అతని పేస్‌‌  ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టడం లేదు. యార్కర్లు అవతలి బ్యాట్స్‌‌మెన్‌‌ను వణికించడం లేదు. అతని వేరియేషన్స్‌‌తో వికెట్లు రావడం లేదు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌‌లో వరుసగా రెండు ఓటములకు ఇండియా బౌలింగ్‌‌ ఫెయిల్యూరే ప్రధాన కారణమైతే అందులో బుమ్రా పాత్రే ఎక్కువ. మూడు వారాల కిందటి వరకూ ఐపీఎల్‌‌లో  బుల్లెట్లలాంటి బాల్స్‌‌తో బ్యాట్స్‌‌మెన్‌‌ను బెంబేలెత్తించిన బుమ్రా ఆసీస్‌‌ గడ్డపై మాత్రం తేలిపోయాడు. ఈ ఒక్క సిరీసే కాదు ఏడాది కాలంగా వన్డేల్లో బుమ్రా ప్రభావం చూపలేకపోతున్నాడు. టీ20 ఫార్మాట్‌‌, టెస్టుల్లో మెరుగ్గా ఆడుతున్నప్పటికీ 50వ ఓవర్ల ఆటకు వచ్చే సరికే  ఈ ముంబైకర్‌‌ తడబడడం చర్చనీయాంశమైంది.

టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో జస్‌‌ప్రీత్‌‌ బుమ్రా చాలా కీలక ప్లేయర్‌‌. పేస్‌‌ బౌలింగ్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ను ముందుండి నడిపించే అతను జట్టు మూలస్థంభాల్లో ఒకడు. అలాంటి ప్లేయర్‌‌ ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేల్లో దారుణంగా ఆడాడు. ముఖ్యంగా డెత్‌‌ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్‌‌ చేసే అతను రెండు మ్యాచ్‌‌ల్లోనూ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. తొలిపోరులో 73 పరుగులు ఇచ్చుకున్న  ఈ 26 ఏళ్ల యువ పేసర్‌‌  కేవలం ఆరోన్‌‌ ఫించ్‌‌ వికెట్‌‌ మాత్రమే తీయగలిగాడు. అదే సెకండ్‌‌ వన్డేల్లో 79 రన్స్‌‌ ఇచ్చేసి మరో వికెట్‌‌తో సరిపెట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌‌లో అందరికంటే ఎక్కువ రన్స్‌‌ అతనే ఇచ్చుకున్నాడు.  ఐపీఎల్‌‌లో 27 వికెట్లతో సెకండ్‌‌ బెస్ట్‌‌ బౌలర్‌‌గా నిలిచిన జస్‌‌ప్రీత్‌‌ నుంచి ఇలాంటి పెర్ఫామెన్స్‌‌ ఎవ్వరూ ఊహించలేదు. తాను కూడా ఇలా ఫెయిలవుతానని బుమ్రా కూడా అనుకొని ఉండడు. అందుకే సెకండ్‌‌ మ్యాచ్‌‌లో తన బౌలింగ్‌‌ కోటా పూర్తయిన తర్వాత అతను చాలా నిరుత్సాహంగా కనిపించాడు. ఫ్రస్ట్రేషన్‌‌లో 30 యార్డ్‌‌ ఫీల్డింగ్‌‌ మార్కర్స్‌‌ను కాలితో తన్నాడు. గ్రౌండ్‌‌లో అతను ఇంత ముభావంగా కనిపించిన సందర్భాలు చాలా అరుదు.

వర్క్‌‌లోడ్‌‌ కారణమా?  గాయం భయమా?

స్వదేశంలో ఆడినా.. ఫారిన్‌‌ టూర్‌‌కు వెళ్లినా అవతలి జట్టులో బెస్ట్‌‌ ప్లేయర్‌‌ను టార్గెట్‌‌ చేయడం ఆస్ట్రేలియా స్టయిల్‌‌. ఈ సిరీస్‌‌లో కూడా వాళ్లు అదే ఫార్ములా కొనసాగించారు. ఇండియా టాప్‌‌ పేసర్‌‌ అయిన బుమ్రాను టార్గెట్‌‌ చేసిన కంగారూలు అందులో సక్సెస్‌‌ అయ్యారు. ఇంకోవైపు బుమ్రా బౌలింగ్‌‌లో ఎలాంటి వైవిధ్యం కనిపించలేదు. యూఏఈలో మాదిరిగా బౌన్స్‌‌ రాబట్టలేకపోయాడు. ఐపీఎల్‌‌లో గొప్పగా ఆడిన అతను పవర్‌‌ప్లేలో శుభారంభం ఇస్తాడని ఆశించిన టీమ్‌‌కు నిరాశే మిగిలింది. కనీసం డెత్‌‌ ఓవర్లలో అయినా పరుగులు నియంత్రించలేకపోవడం టీమ్‌‌ను దెబ్బకొట్టింది. అతని బౌలింగ్‌‌లో స్టీవ్‌‌ స్మిత్‌‌, గ్లెన్‌‌ మ్యాక్స్‌‌వెల్‌‌  ఓ రేంజ్‌‌లో చెలరేగిపోయారు.  అయితే, బుమ్రాను యూజ్‌‌ చేసే విషయంలో  కెప్టెన్‌‌ కోహ్లీ కూడా తప్పిదాలు చేశాడు. సెకండ్‌‌ వన్డే ఫస్ట్‌‌ స్పెల్‌‌లో అతనికి రెండే ఓవర్లు ఇవ్వడాన్ని గౌతమ్‌‌ గంభీర్‌‌ సహా పలువురు మాజీలు తప్పుబడుతున్నారు. ఫస్ట్‌‌ వన్డేలో మెప్పించిన షమీ కూడా చేతులెత్తేయడం ఇండియా కొంప ముంచింది. అయితే, వీరిద్దరికి సపోర్ట్‌‌ ఇచ్చే సరైన థర్డ్‌‌ పేసర్‌‌ లేకపోవడం కూడా కోహ్లీసేన వీక్​నెస్​గా మారింది. ఇది చాన్నాళ్ల నుంచి ఉన్న సమస్యే. ముఖ్యంగా టీమ్‌‌లో భువనేశ్వర్‌‌ కుమార్‌‌ లేనిలోటు స్పష్టంగా కనిపిస్తోంది. న్యూ బాల్‌‌తో అటాకింగ్‌‌ బౌలర్‌‌గా అతను పవర్‌‌ ప్లేలో జట్టుకు శుభారంభాలు ఇచ్చేవాడు. కానీ, గాయం కారణంగా భువీ టీమ్‌‌కు దూరం కావడంతో బుమ్రా, షమీలపైనే ఈ బాధ్యత పడింది. పైగా, ఈ  సిరీస్‌‌లో మూడో పేసర్‌‌గా వచ్చిన నవదీప్‌‌ సైనీ విఫలమవడంతో వారిద్దరిపై  ఇంకా ఒత్తిడి పెరిగింది. ఇప్పటికే  ఒకటిన్నర నెలల పాటు ఐపీఎల్‌‌లో ఇద్దరూ అలసిపోయారు. వారి వర్క్​లోడ్​పై మేనేజ్​మెంట్​ కూడా దృష్టి పెట్టింది.

అలాగే, లోయర్‌‌ బ్యాక్‌‌ ఇంజ్యూరీ కారణంగా 2019 సెకండాఫ్‌‌కు దూరమైన బుమ్రాలో మళ్లీ గాయపడతానన్న భయం ఉండొచ్చని, అందుకే రిస్క్‌‌ తీసుకోవడం లేదని మాజీ పేసర్‌‌ మనోజ్‌‌ ప్రభాకర్‌‌ అంటున్నాడు. బుమ్రా తడబాటుకు వీటన్నింటినీ కారణాలుగా చెప్పొచ్చు. అయితే, కెప్టెన్‌‌ కోహ్లీ, వైస్‌‌ కెప్టెన్‌‌ రాహుల్‌‌ అతనికి బాసటగా నిలిచారు. కాబట్టి బుమ్రా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా తిరిగి పుంజుకోవడంపై దృష్టి పెట్టాలి. అదే టైమ్​లో లాంగ్‌‌ టర్మ్‌‌ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మేనేజ్‌‌మెంట్‌‌ నాణ్యమైన మూడో పేసర్‌‌ను వెతుక్కోవడం మంచిది.  భువీ మాదిరిగా న్యూబాల్‌‌తో సత్తాచాటే దీపక్‌‌ చహర్‌‌కు చాన్స్‌‌ ఇవ్వాలని పలువురు మాజీలు సూచిస్తున్నారు. శార్దుల్‌‌ ఠాకూర్‌‌ కూడా మంచి ఆప్షనే. ఇక, ఐపీఎల్‌‌లో అదరగొట్టిన టీ20తో పాటు వన్డే టీమ్‌‌లో చోటు దక్కించుకున్న యార్కర్ల స్పెషలిస్ట్‌‌ టి. నటరాజన్‌‌ను పరీక్షిస్తే ఫలితం ఉండొచ్చు.

వరల్డ్‌‌‌‌ కప్‌‌ తర్వాత డీలా..

ఆసీస్​పై రెండు మ్యాచ్‌‌లే కాదు. గత కొన్నాళ్లుగా వన్డే ఫార్మాట్‌‌లో బుమ్రా ఆకట్టుకోవడం లేదు. లాస్ట్‌‌ ఇయర్‌‌ ఇంగ్లండ్‌‌లో జరిగిన వరల్డ్‌‌కప్‌‌లో అద్భుత పెర్ఫామెన్స్‌‌ చేసిన అతను ఈ ఏడాది ఆడిన 8 వన్డేల్లోనూ ప్రభావం చూపింది లేదు. ఆ ఎనిమిది మ్యాచ్‌‌ల్లో 76.1 ఓవర్లు బౌలింగ్‌‌ చేసిన బుమ్రా  మూడంటే మూడు వికెట్లే తీశాడు. న్యూజిలాండ్‌‌తో మూడు వన్డేల సిరీస్‌‌లో అయితే ఒక్క వికెట్‌‌ కూడా తీయలేదు. దీన్ని బట్టి ఈ ఫార్మాట్‌‌లో అతని పెర్ఫామెన్స్‌‌ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.  వాస్తవానికి వన్డేల్లో అతనికి మంచి రికార్డుంది. కెరీర్‌‌లో 66 మ్యాచ్‌‌లాడిన జస్‌‌ప్రీత్‌‌ 106 వికెట్లు పడగొట్టి తక్కువ టైమ్‌‌లో టీమ్‌‌లో  ప్రధాన పేసర్‌‌గా ఎదిగాడు. అతని ఓవరాల్‌‌గా యావరేజ్‌‌ 25.40, స్ట్రయిక్‌‌ రేట్‌‌ 325.6గా ఉంది. కానీ, ఈ ఏడాది అతని యావరేజ్‌‌ 146.33,  స్ట్రయిక్‌‌ రేట్‌‌ 152.3గా  దిగజారింది. అంటే సగటున 32 బాల్స్‌‌కు   ఓ వికెట్‌‌ పడగొట్టే  జస్‌‌ప్రీత్‌‌ ఇప్పుడు 152 బాల్స్‌‌కు గానీ వికెట్‌‌ తీయలేకపోతున్నాడు. ఒక్కోసారి వికెట్లు తీయకున్నా పరుగులు నియంత్రించే బుమ్రా కొన్నాళ్లుగా ధారాళంగా రన్స్‌‌ ఇస్తున్నాడు. అది టీమ్‌‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది.ఈ ఏడాది ఇండియా వరుసగా ఐదు  వన్డేల్లోనూ ఓడిపోవడంలో  బుమ్రా ఫెయిల్యూర్‌‌ కూడా ఓ కారణంగా చెప్పొచ్చు.