ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు బీజేపీనే వ్యతిరేకం

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు బీజేపీనే వ్యతిరేకం

న్యూఢిల్లీ: రిజర్వేషన్ల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ తమపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు బీజేపీనే వ్యతిరేకమని తెలిపింది.1950 నుంచి కాంగ్రెస్ ప్రధానులు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు అయ్యాయని స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకమని ప్రధాని పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని జైరాం రమేశ్ మండిపడ్డారు. 

ఇది పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు. బీఆర్.అంబేద్కర్, జవహర్‌‌‌‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇతర కాంగ్రెస్ నాయకుల కృషి ఫలితంగానే రాజ్యాంగంలో  షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లు చేర్చబడ్డాయని వివరించారు. 1994లో పీవీ.నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో తొలిసారిగా ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు.

 2006లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఉన్నత విద్యాసంస్థల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. మహిళా రిజర్వేషన్‌‌‌‌ బిల్లుపై చర్చ జరిగినప్పుడు కూడా ఓబీసీ మహిళలకు సపరేట్ రిజర్వేషన్‌‌‌‌ కల్పించాలని కాంగ్రెస్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ చేసిందని వెల్లడించారు. కానీ అందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదని చెప్పారు. దీనినిబట్టి చూస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లకు బీజేపీనే వ్యతిరేకమని జైరాం రమేశ్ పేర్కొన్నారు.