ప్రధాని పదవి గౌరవాన్ని దెబ్బ తీస్తున్న మోదీ: కర్నాటక సీఎం

ప్రధాని పదవి గౌరవాన్ని దెబ్బ తీస్తున్న మోదీ: కర్నాటక సీఎం

కలబురగి: ప్రధాని పదవి గౌరవాన్ని నరేంద్ర మోదీ దెబ్బ తీస్తున్నారని కర్నాటక సీఎం సిద్ద రామయ్య ఆరోపించారు. శనివారం కలబురిగిలో విలేకర్లతో ఆయన మాట్లాడారు. ‘‘నరేంద్ర మోదీ అబద్ధాలు బాగా చెబుతారు. బీజేపీ అద్భుతంగా వాటిని మార్కెటింగ్ చేస్తుంది. పనికిరాని మాటలు మాట్లాడి ప్రజల మనోభావాలను రెచ్చగొట్టడం ద్వారా ప్రధాని పదవి గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. రిజర్వేషన్, మంగళ సూత్రాల అంశాలపై ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశాం. ఇప్పటి వరకు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. 

నోటీసులు మాత్రమే అందించారు. ఏం చర్యలు తీసుకుంటారోనని మేం ఎదురు చూస్తున్నాం. ప్రధాని చెప్పే అబద్ధాలను ప్రజలు బాగా అర్థం చేసుకుంటున్నారు” అని తెలిపారు. కర్నాటకలో కాంగ్రెస్ మెజార్టీ సీట్లను గెల్చుకుంటుందని సిద్ద రామయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు గ్యారంటీలు ప్రజల జీవితాలపై ప్రభావం చూపాయి. కాంగ్రెస్ పై ప్రజలకు నమ్మకముందని నేను అనుకుంటున్నాను. ఓటర్లందరూ తెలివైనవారు. వారు విచక్షణ ఆధారంగా ఓటేస్తారు” అని చెప్పారు.