- 1247 హైర్, ఎలక్ట్రిక్ బస్సులను తిప్పిన యాజమాన్యం
- రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికుల ఇబ్బందులు
- డిపోల వద్ద బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్న కార్మికులు
- ఆయాచోట్ల పోలీసులకు, కార్మికులకు మధ్య ఘర్షణ
- మొదటిరోజు సమ్మె సక్సెస్: ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న
- 30 శాతం బస్సులను నడిపినం: యాజమాన్యం
- డిప్యూటీ సీఎంతో మంత్రి పొన్నం, ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీ
హైదరాబాద్/నెట్వర్క్, వెలుగు: ఆర్టీసీ సమ్మె కారణంగా బుధవారం బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 6,779 బస్సులు డిపోలకే పరిమితం కాగా, 1,247 అద్దె బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులను మాత్రం యాజమాన్యం తిప్పింది. దీని వల్ల పూర్తిస్థాయిలో సమ్మె ప్రభావం పడకుండా చూడగలిగింది. కానీ పెద్ద సంఖ్యలో బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్స్టేషన్లలో గంటల తరబడి పడిగాపులు కాసి, చివరికి ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. ఇదే అదనుగా ప్రైవేట్వాహనదారులు రెట్టింపు చార్జీలు వసూలు చేశారు. పలు డిపోల నుంచి ఆర్టీసీ బస్సులను ప్రైవేట్ డ్రైవర్లతో నడిపించే ప్రయత్నం చేయగా, కార్మికులు అడ్డుకున్నారు. దీంతో కార్మికుల, పోలీసుల మధ్య వాగ్వాదాలు, తోపులాటలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కాగా, బుధవారం 30శాతం బస్సులను తిప్పామని వెల్లడించిన యాజమాన్యం గురువారం నుంచి 50శాతం బస్సులు తిప్పుతామని ప్రకటించింది. ఇందుకోసం ప్రైవేట్ డ్రైవర్లను, కండక్టర్లను విధుల్లో చేర్చుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అటు మొదటి రోజు సమ్మె సక్సెస్అయినట్లు ప్రకటించిన ఆర్టీసీ కార్మిక జేఏసీ రెండోరోజు కార్యాచరణ ప్రకటించింది. గురువారం ఉదయం 5 గంటల నుంచి అన్ని డిపోల ముందు ధర్నా చేపట్టనున్నట్లు పేర్కొంది. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టితో మంత్రి, ఐఏఎస్ల కమిటీ సమావేశమై కార్మికులు పెట్టిన 32 డిమాండ్లపై చర్చించారు. కాగా, ఈ వివరాలేవీ బయటకు రానివ్వలేదు. గురువారం మరోసారి చర్చలు జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఉదయం నుంచే డిపోల ఎదుట ఆందోళన
ఉమ్మడి నల్గొండ జిల్లా కోదాడ డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్న కార్మికులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడిపించేందుకు ప్రయత్నించగా ఒక కార్మికుడు బస్సుకు అడ్డంగా పడుకున్నాడు. దీంతో ఆందోళన చేస్తున్న కార్మికులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, భద్రాచలం డిపోల ఎదుట కార్మికులు ధర్నా చేయగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 11 డిపోల్లో సమ్మె ప్రభావం కనిపించింది. సుమారు 1000 బస్సులు ఉండగా.. బుధవారం హైదరాబాద్, వేములవాడ, మెట్ పల్లి, వరంగల్, గోదావరిఖని తదితర రూట్లలో 400 బస్సులు నడిపారు. 330 అద్దె బస్సుల డ్రైవర్లు విధుల్లో పాల్గొన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్, మెదక్, హుస్నాబాద్ డిపోల్లో అధికారులు బస్సులను బయటకు పంపడంతో ఆర్టీసీ జేఏసీ నేతలు, కార్మికులు అడ్డుకొని ఆందోళనకు దిగారు. బస్సు టైర్లలో నుంచి గాలి తీసి రోడ్లపై బైఠాయించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, ఆర్టీసీ కార్మికుల మధ్య తోపులాట జరిగింది. పలు డిపోల వద్ద మహిళ కార్మికులు బతుకమ్మ ఆటలు ఆడుతూ నిరసన తెలిపారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట డిపోలో 95 బస్సులకు గాను ఐదు బస్సులు మాత్రమే నడిచాయి. ఈ బస్సుల్లోనూ ప్రయాణికులకు టికెట్లు ఇష్యూ చేయకపోవడంతో ఫ్రీగా ప్రయాణించారు. మహబూబ్ నగర్ బస్టాండ్ వద్ద ఆర్టీసీ హైర్ బస్సులను నడుపుతున్న ప్రైవేట్ డ్రైవర్లను కార్మికులు అడ్డుకున్నారు. పోలీసులు వారిని ఆపేందుకు ప్రయత్నించగా రోడ్డుకు అడ్డంగా పడుకున్నారు. దీంతో పోలీసులు కార్మికుల మధ్య తోపులాట జరిగింది. నారాయణపేటలోనూ ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కరీంనగర్ బైపాస్ రోడ్డులో లారీని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బస్సు ముందు అద్దాలు ధ్వంసమయ్యాయి. నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. కాగా, బుధవారం పలు బస్సుల్లో కండక్టర్లు లేకపోవడంతో మహిళా ప్రయాణీకులతో పాటు పురుషులు సైతం ఉచితంగానే తమ గమ్య స్థానాలకు చేరుకున్నారు.
సమ్మె సక్సెస్: జేఏసీ ఛైర్మన్ ఈదురు వెంకన్న
తొలిరోజు సమ్మె సక్సెస్ అయిందని జేఏసీ ఛైర్మన్ ఈదురు వెంకన్న మీడియాకు చెప్పారు. కొన్నిచోట్ల పోలీసులను పెట్టి బలవంతంగా అద్దె బస్సులను, ఎలక్ట్రిక్ బస్సులను నడిపారన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు ఎన్నిరోజులైనా సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఎండీ బెదిరింపులకు తాము భయపడేదిలేదని చెప్పారు. గురువారం నుంచి తమ సమ్మెను మరింత ఉధృతం చేస్తామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు తమను ఆహ్వానించి, తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని ఈదురు వెంకన్న కోరారు.
గురువారం నుంచి 50 శాతం బస్సులు తిప్పుతాం: యాజమాన్యం
తొలిరోజు తాము 30 శాతం వరకు బస్సులను తిప్పగలిగామని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. రెండో రోజు నుంచి దీన్ని 40 నుంచి 50 శాతానికి పెంచుతామని వెల్లడించింది. అద్దె బస్సులతో పాటు ఎలక్ట్రిక్ బస్సులు, ప్రైవేట్డ్రైవర్లతో ఆర్టీసీ బస్సులను కూడా నడిపిస్తామని స్పష్టంచేసింది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడడమే తమ సంస్థ లక్ష్యమని వెల్లడించింది.
డిప్యూటీ సీఎం భట్టితో మంత్రి, ఐఏఎస్ల కమిటీ భేటీ..
కాగా, తొలిరోజు సమ్మె ప్రభావంపై బుధవారం రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, రవాణా శాఖ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ భేటీ అయి చర్చించారు. తొలిరోజు 30శాతం బస్సులు మాత్రమే నడపడం వల్ల ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారని, గురువారం 50శాతం బస్సులను నడపడంపై చర్చించారు.

