మల్కాజ్గిరి, వెలుగు: భారీ లాభాల ఆశ చూపి ఓ వ్యాపారిని సైబర్ నేరగాళ్లు రూ.65.23 లక్షలు మోసం చేశారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగార్జున నగర్ కాలనీకి చెందిన చిలుకూరి ఉదయ్ భాస్కర్(48)కు గత మే 1న వాట్సాప్ కాల్స్ వచ్చాయి. తాము ఫిన్‌సోల్ సెక్యూరిటీస్ సంస్థ ప్రతినిధులమని పరిచయం చేసుకున్న నిందితులు.. ఐపీవోలు, బ్లాక్ డీల్స్, డిస్కౌంట్షేర్లలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించారు.
సెబీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు చూపించి, నకిలీ ఫిన్‌సోల్ ఆల్గో యాప్‌ను డౌన్‌లోడ్ చేయించారు. తొలుత స్వల్ప లాభాలు ఇచ్చి నమ్మకం కలిగించిన కేటుగాళ్లు, దశలవారీగా బాధితుడి నుంచి రూ.66.49 లక్షలు జమ చేయించుకున్నారు. యాప్‌లో రూ.3.80 కోట్ల లాభాలు చూపించి, విత్డ్రా చేసుకోబోతే సర్వీస్ చార్జీల పేరుతో మరింత వసూలు చేశారు. బాధితుడికి కేవలం రూ.1.26 లక్షలు మాత్రమే వెనక్కిచ్చారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కుషాయిగూడ పోలీసులు పేర్కొన్నారు.
