మూడు MLC స్థానాలకు ఉప ఎన్నికలు

మూడు MLC స్థానాలకు ఉప ఎన్నికలు

రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్నమూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 31న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు ఈసీ షెడ్యూల్‌ విడుదలచేసింది. మంగళవారం నోటిఫికేషన్‌ జారీకానుంది. ఈ నెల 14 వరకు నామినేషన్లు తీసుకుంటారు. మరుసటి రోజు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 31న ఉదయం 8 గంటలనుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. జూన్‌ 3న ఓట్లు లెక్కిస్తారు. రంగారెడ్డి స్థానిక సంస్థల కోటాలో మండలికి ఎన్నికైన పట్నం నరేందర్‌ రెడ్డి, నల్గొండ స్థానిక సంస్థల కోటాలో మండలికి ఎన్నికైన ఎమ్మెల్సీ కోమటిరెడ్డి గోపాల్‌ రెడ్డి డిసెంబర్​లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీంతో వారు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు.

వరంగల్‌ స్థానికసంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్ని కైన కొండా మురళీ టీఆర్‌ఎస్‌ ను వీడి కాంగ్రెస్‌ లో చేరడంతో ఆ పదవికి రాజీనామా చేశారు. దీంతో రంగారెడ్డి, నల్గొండ, వరంగల్​ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ ను రాష్ట్ర ఎన్నికల అధికారులు అనుమతి కోరారు. ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో సోమవారం షెడ్యూల్‌ విడుదల చేశారు.

దక్కేది ముగ్గురికేనా?
మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో షెడ్యూల్​ విడుదలవడంతో ఆ సీట్లను ఆశిస్తున్న టీఆర్​ఎస్​ నేతలు..మంత్రులు, ఇతర ముఖ్య నేతల వద్దకు చేరుకుంటున్నారు. మల్కాజ్ గిరి ఎంపీ సీటును ఆశించిన నవీన్‌ రావుకు ఎమ్మెల్సీ స్థానం ఇస్తామని సీఎం ఇదివరకే హామీ ఇచ్చారు. రాష్ట్ర కేబినెట్‌ లో స్థానం ఆశిస్తున్ననల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డికి మరో బెర్త్‌‌ తచేశారు. వరంగల్‌ స్థానిక సంస్థల సీటు వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సన్నిహితుడైన పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డికి ఇవ్వనున్నట్టు ప్రచారంలో ఉంది. మండలి స్థానాన్ని ఆశించే పోచంపల్లి తన సోదరిని వరంగల్‌ మేయర్‌ రేసు నుంచి తప్పించినట్లు టీఆర్​ఎస్​ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీకి త్వరలో నోటిఫికేషన్‌
ఎమ్మెల్యే కోటాలో మండలికి ఎన్నికైన మైనంపల్లి హన్మంతరావు డిసెంబర్​లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్ గిరి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఆ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. దీన్ని భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది. ఇక, అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌ ను వీడిన రాములు నాయక్‌ (గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ), యాదవరెడ్డి (ఎమ్మెల్యేల కోటాఎమ్మెల్సీ), భూపతిరెడ్డి (నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ) సభ్యత్వాలను టీఆర్​ఎస్​ ఫిర్యాదు మేరకు మండలి చైర్మన్‌ రద్దు చేశారు. మండలి చైర్మన్‌ నిర్ణయాన్ని ముగ్గురు నేతలు హైకోర్టులో సవాల్‌ చేశారు. పిటిషన్లపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.