లక్ష నుంచి 15  వేలకు పడిపోయిన క్యాబ్స్

లక్ష నుంచి 15  వేలకు పడిపోయిన క్యాబ్స్
  • డీజిల్ ​రేట్లు పెరగడం, కమీషన్ లేక డ్రైవర్లకు తిప్పలు
  • రైడ్లు లేక ప్రైవేట్​ ఏజెన్సీలకు వెళ్తున్న  డ్రైవర్లు
  • కిస్తీలు కట్టేందుకు ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు ట్రిప్పులు 

హైదరాబాద్, వెలుగు: ఒకప్పటిలా గ్రేటర్ హైదరాబాద్ ​జనం క్యాబ్​లు ఎక్కడం లేదని డ్రైవర్లు వాపోతున్నారు. రోజురోజుకు బుకింగ్స్ భారీగా తగ్గిపోతున్నాయని చెబుతున్నారు. గతంలో ఒకదాని తర్వాత ఒకటి గ్యాప్​లేకుండా రైడ్లు పడేవని.. ఇప్పుడా పరిస్థితి లేదంటున్నారు. బుకింగ్స్​లేక, కంపెనీలు కమీషన్లు పెంచక తిప్పలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన డీజిల్ రేట్లతో ఎండాకాలంలో ఏసీ ఆన్‌‌‌‌‌‌‌‌ చేస్తే మైలేజ్ రాదని డ్రైవర్లు ఆందోళనకు దిగారు. కానీ కంపెనీలు పట్టించుకోలేదు. కమీషన్లు పెంచలేదు. చేసేదేం లేక చాలా మంది క్యాబ్​కంపెనీల కింద తిప్పడం ఆపేశారు. గ్రేటర్​పరిధిలో రెండు ప్రముఖ కంపెనీలకు సంబంధించి గతంలో లక్ష క్యాబ్​లు ఉండేవి. ప్రస్తుతం15 వేలు తిరుగుతున్నాయి. ఉన్నవాటికి కూడా పెద్దగా బుకింగ్స్​ఉండట్లేదని డ్రైవర్లు వాపోతున్నారు. ఫైనాన్స్​లు కట్టలేక ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీల బాట పడుతున్నారు. వాటి సాయంతో బుకింగ్స్ తీసుకుని ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు ట్రిప్పులు వేస్తున్నారు.

కరోనాకు ముందు.. 

కరోనా రాక ముందు జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ పరిధిలో రెండు ప్రముఖ క్యాబ్​సంస్థల కింద లక్ష కార్లు తిరిగేవని తెలంగాణ రాష్ట్ర క్యాబ్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ తెలిపారు. వివిధ కారణాలతో ఆ సంఖ్య 15 వేలకు పడిపోయిందని చెప్పారు. ఇవి కాకుండా ఐటీ కంపెనీల కాంట్రాక్టర్ల కింద 15 వేల క్యాబ్‌‌‌‌‌‌‌‌లు నడుస్తున్నాయని వెల్లడించారు. గతంలో షేరింగ్, ఇండివిజ్యువల్ బుకింగ్స్ ఎక్కువగా జరిగేవి. ఉదయం నుంచి రాత్రి వరకు డ్రైవర్లు కంటిన్యూస్‌‌‌‌‌‌‌‌ గా రైడ్లు వేసేవారు. కరోనా రావడం, డీజిల్ రేట్లు అమాంతం పెరగడం, డ్రైవర్లకు ఇచ్చే కమీషన్​ను కంపెనీలు పెంచకపోవడం ఇలా వివిధ కారణాలతో క్యాబ్​లు నడిపేవారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఇదే క్రమంలో వివిధ కంపెనీలు ఆటోలు, బైక్​ట్యాక్సీలను అందుబాటులోకి తేవడం, సొంత కార్లు పెరిగిపోవడంతో క్యాబ్​లు ఎక్కేవారు తగ్గిపోయారు. అలాగే సమ్మర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏసీ బంద్ చేసి క్యాబ్​డ్రైవర్లు నిరసన తెలపగా, చివరికి వారికే ఎదురదెబ్బ తగిలింది.

ఏసీ ఆన్​చేస్తే మైలేజ్ రాదు..

‘‘ తాము ఎంత చేసినా కంపెనీలు మాకు చుక్కలు చూపిస్తున్నాయి. ఐదేండ్ల నుంచి క్యాబ్ డ్రైవరుగా పనిచేస్తున్నా. లోన్ తీసుకుని కారు కొని క్యాబ్​కింద పెట్టినా. మంచిగా నడుస్తుంది అనుకున్న టైంలో లాక్ డౌన్ వచ్చి పడింది. ఏసీ ఆన్​చేస్తే మైలేజ్ రాదు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ రేట్లు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టాయి. కంపెనీ ఇస్తున్న కమీషన్ ఏ మూలకూ సరిపోవడంలేదు. దాన్ని పెంచాలని మేం నిరసన తెలిపి చివరికి మేమే దెబ్బ తిన్నాం. ఏసీ వేయాలంటే అదనంగా పే చేయాలని డిమాండ్​చేయడంతో కస్టమర్లు క్యాబ్​డ్రైవర్లపై కంప్లైంట్‌‌‌‌‌‌‌‌లు ఇచ్చారు. కంపెనీలు రూడ్ బిహేవియర్ అని ఫైన్‌‌‌‌‌‌‌‌లు వేసిన సందర్భాలు ఉన్నాయి. ఎటు చూసుకున్నా మాకే నష్టమైంది. అందుకే తెలిసిన వాళ్ల ద్వారా బయట జిల్లాలకు, రాష్ట్రాలకు ట్రిప్పులు వేస్తున్నాను’’ అని క్యాబ్ డ్రైవర్ రమేశ్​తెలిపారు. ఈయన ఒక్కరిదే కాదు మిగిలిన వారిదీ ఇదే పరిస్థితి. బయట బుకింగ్స్ ఉంటే చెప్పాలి అని ట్రావెల్​ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నారు. 

ఇంటర్ స్టేట్ బుకింగ్స్..

ప్రస్తుతం ఫైనాన్స్​కిస్తీలు పూర్తయ్యాక చాలా మంది సొంత నంబర్​ప్లేట్​తో ఇతర రాష్ట్రాలకు ట్రిప్పులు వేస్తున్నారు. ఎక్కువగా విజయవాడ, కర్నూలు, గుంటూరు‌‌‌‌‌‌‌‌ వెళ్తున్నారు. సొంత నంబర్ ప్లేట్​ఉన్నవాళ్లు బార్డర్ల దగ్గర టాక్స్‌‌‌‌‌‌‌‌లు కట్టాల్సి ఉంటుంది. ఎల్లో ప్లేట్ అయితే ఆ ఛార్జీలు కూడా లేకుండా వెళ్లి వచ్చేస్తున్నారు. అలాగే లాంగ్ బుకింగ్స్ తో మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుందని, పైసలు మిగులుతున్నాయని డ్రైవర్లు చెబుతున్నారు. దీంతోనే క్యాబ్​కింద తిప్పడం ఆపేసి అవుట్ సైడ్ ట్రిప్పులకు వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు. ఏజెన్సీల ద్వారా వెళ్తున్న కొందరైతే తమ క్యాబ్‌‌‌‌‌‌‌‌లో ట్రావెల్ చేస్తున్న కస్టమర్లను పరిచయం చేసుకుని, వారికి అవసరమైనప్పుడు తమను సంప్రదించాలని కోరుతున్నారు. 

ఫైనాన్స్ లు కట్టేందుకే..

ఒకప్పటిలా క్యాబ్‌‌‌‌‌‌‌‌లకు గిరాకీ ఉండడం లేదు. గ్రేటర్​లో సొంత వెహికల్స్ పెరిగిపోయాయి. లేనివారు ఆటోలు ఎక్కుతున్నారు. క్యాబ్‌‌‌‌‌‌‌‌ డ్రైవర్లకు అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బతుకుదెరువు కోసం వేరే మార్గాలను వెతుక్కుంటున్నారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల బుకింగ్స్ తీసుకుని వెళ్తున్నారు. వాటితోనే ఫైనాన్స్ లు కట్టుకుంటున్నారు. సిటీలోని క్యాబ్‌‌‌‌‌‌‌‌ డ్రైవర్లందరిదీ ఇదే పరిస్థితి.

- శివ, స్టేట్ ప్రెసిడెంట్, తెలంగాణ కాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్

ఒకప్పటి పరిస్థితి లేదు

చాలా కష్టపడి  ఫైనాన్స్​లో కారు తీసుకున్నా. గతంలో బుకింగ్స్ ఎక్కువగా వచ్చేవి. ఇప్పుడా పరిస్థితులు లేవు. రానురాను క్యాబ్​లు ఎక్కేవారి సంఖ్య తగ్గిపోతుంది. రైడ్లు పెద్దగా ఉండడం లేదు. మా సర్కిల్‌‌‌‌‌‌‌‌లో ఒకరికొకరం సాయం చేసుకొంటూ బయట జిల్లాలకు ట్రిప్పులు వేస్తున్నాం.

- శంకర్, క్యాబ్‌‌‌‌‌‌‌‌ డ్రైవర్