బీఆర్ఎస్ ప్రభుత్వం.. కేసీఆర్ హయాంలో 88 కోట్ల రూపాయల విలువైన మందులు వృథా అయ్యాయని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి హయాంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో.. కేవలం 9 లక్షల రూపాయల విలువైన మెడిసిన్ వృథా అయినట్లు కాగ్.. లెక్కలతో సహా వివరాలు వెల్లడించింది.
ప్రభుత్వ హాస్పిటల్స్‌కు వచ్చే పేషెంట్స్ కోసం చేసిన మెడిసిన్ కొనుగోలు వివరాలతో తెలంగాణ మెడికల్ కార్పొరేషన్ అధికారులు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు ఏప్రిల్ 29న బుధవారం నివేదిక ఇచ్చారు. ఈ రిపోర్ట్ ప్రకారం 2017 నుంచి 2023 వరకూ సుమారు 2700 కోట్ల విలువైన మెడిసిన్ కొనుగోలు చేయగా.. అందులో ఏకంగా 88 కోట్ల విలువైన మెడిసిన్ వృథాగా పోయిందని వివరించారు. 2021–2023 మధ్య వృథా ఎక్కువగా ఉందన్నారు.
ఏయే సంవత్సరం ఎన్ని కోట్ల మేర మెడిసిన్స్ వృథా అయ్యాయో లెక్కలు మంత్రికి అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏకంగా 88 కోట్ల మేర మెడిసిన్ వృథా అయినట్టు ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 2021లో 26 కోట్లు, 2022లో 27 కోట్లు, 2023లో 12 కోట్ల రూపాయల మెడిసిన్ ఎక్స్‌పైరీ అయ్యి, నేలపాలు అయినట్టు అధికారులు ఇచ్చిన నివేదిక స్పష్టం చేసింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ రెండున్నర సంవత్సరాల్లో సుమారు వెయ్యి కోట్ల రూపాయల విలువైన మెడిసిన్ కొనుగోలు చేయగా అందులో కేవలం 9 లక్షల రూపాయల మెడిసిన్ మాత్రమే ఎక్స్‌పైరీ అయిందని తెలిపారు. గతంతో పోలిస్తే మెడిసిన్ వృథా ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయిందని అధికారులు మంత్రికి వివరించారు.
మెడిసిన్ ఎక్స్‌పైరీ అవ్వడానికి 3 నెలల ముందే, హాస్పిటల్స్ నుంచి వెనక్కి తెప్పిస్తున్నామని వెల్లడించారు. ఎక్స్‌పైరీ అయిన మెడిసిన్‌కు అయ్యే మొత్తం ఖర్చును మెడిసిన్ సప్లై చేసిన సంస్థే భరించే విధంగా టెండర్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ రెండున్నర సంవత్సరాల్లో ఎక్స్‌పైరీ అయిన 9 లక్షల విలువైన మెడిసిన్‌కు బదులు, అంతే విలువైన మెడిసిన్‌ను కాంట్రాక్టర్ ఉచితంగా సప్లై చేశారని టీజీఎంఎస్‌ఐడీసీ అధికారులు మంత్రికి వివరించారు.

