మన మామ బంగారం: చందమామలో గోల్డ్‌‌ ఆనవాళ్లు

మన మామ బంగారం: చందమామలో గోల్డ్‌‌ ఆనవాళ్లు

‘‘చందమామ రావె.. జాబిల్లి రావె.. కొండెక్కి రావె.. గోగిపూలు తేవె”.. చిన్నపిల్లలు మారాం చేస్తుంటే గోరుముద్దలు తినిపిస్తూ
అమ్మ పాడే జాబిలి పాట. మరి, ఆ అమ్మ పాట పాడినంత మాత్రాన చందమామ గోగిపూలు ఇస్తుందా! ఏమో తెల్వదుగానీ, బంగారం మాత్రం ఇస్తుంది! అవును, జాబిలి తన కడుపులో ఎంతెంతో బంగారం దాచుకుందట! కెనడాకు చెందిన డల్హౌసీ యూనివర్సిటీ సైంటిస్టుల పరిశోధనలో ఈ విషయం తేలింది. చంద్రుడి నేల లోపలి పరిస్థితులను సైంటిస్టులు పరీక్షించి ఈ అంచనాకు వచ్చారు.
మరి, జాబిలి లోపల బంగారం ఉంది అని వారు చెప్పేందుకు కారణాలేంటి? ఓ లుక్కేసేద్దాం!!

సైడరోఫైల్స్​! అర్థం కాలేదు కదా. ఇవి ఓ రకమైన మూలకాలు. ఇనుమును ఆకర్షించేవి. ఆ సైడరోఫైల్స్​లో బంగారం, ప్లాటినం వంటివి చాలా చాలా ముఖ్యం. ఆ సైడరోఫైల్స్​ ఖనిజాలే జాబిలి పటాలం లో (చందమామ లోపలి భాగం– మ్యాంటిల్​) ఉన్నట్టు డల్హౌసీ సైంటిస్టులు గుర్తించారు. ఆ ప్రయోగంతోనే బంగారం ఉందన్న అంచనాకు వచ్చారు. అయితే, ఇది అంచనానే అయినా, ఒకవేళ నిజంగా ఉండి ఉంటే వాటిని వెలికి తీయగలమా అన్న అనుమానాన్నీ ముందు పెట్టారు.

సౌర వ్యవస్థ ఏర్పడిన చివరి దశల్లో

భూమిని ఓ ఉల్క ఢీకొట్టినప్పుడు చంద్ర గ్రహం ఏర్పడింది. ఆ తర్వాత అది ఎక్కడో దూరంగా వెళ్లిపోయింది. ఆ టైంలోనే చందమామ నేలలో అనేక ఖనిజాలు ఏర్పడి ఉంటాయని చాలా మంది సైంటిస్టులు అనుకుంటూ వచ్చారు. అయితే, బంగారం విషయంలో మాత్రం అది నిజమై ఉండదేమోనని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డల్హౌసీ యూనివర్సిటీ జియాలజిస్ట్​ జేమ్స్​ బ్రెనాన్​ చెప్పారు. సౌరవ్యవస్థ ఏర్పడిన చివరి రోజుల్లోనే ఖనిజాలు చందమామలో నిక్షిప్తమై ఉండొచ్చని అంటున్నారు. అపోలో 15, అపోలో 17 మిషన్స్​లో భాగంగా తెచ్చిన జాబిలి రాళ్లపై 50 ఏళ్లుగా సైంటిస్టులు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అయితే, వాటిలో సైడరోఫైల్స్​ పరిమాణం తక్కువగా ఉంది. దానికీ ఓ కారణముందని బ్రెనాన్​ అంటున్నారు. నిజానికి అప్పుడు తెచ్చిన రాళ్లు కేవలం 400 కిలోలేనని అంటున్నారు. కాబట్టి సైడరోఫైల్స్​ను గుర్తించాలంటే ఎక్కువ మొత్తంలో శాంపిళ్లు కావాల్సి ఉంటుందని చెబుతున్నారు. అంతమొత్తంలో తీసుకురాలేం కాబట్టి చంద్రుడి లోపలి భాగాన్ని రివర్స్​ ఇంజనీరింగ్​ ద్వారా అంచనా వేయడమే దారి అని చెప్పారు.

వీళ్లేం చేశారు?

రివర్స్​ ఇంజనీరింగ్​ అంటే, దీనికి సంబంధించి చందమామ ఉపరితలానికి వచ్చే లావాలోని మూలకాలను అంచనా వేయడమే. నిజానికి అపోలో ఆస్ట్రోనాట్లు తెచ్చిన శాంపిళ్లతో ప్రారంభ దశలో చంద్రుడిపై ఎలాంటి ప్రభావం ఉందో తెలుసుకునేందుకు సైంటిస్టులు ప్రయత్నించారు. అయితే, ఒక్కొక్కరు ఒక్కో వాదన వినిపించారు. ఏదైనా ఉల్క భూమిని ఢీకొట్టినప్పుడు ఏర్పడిన వేరే ముద్దలోని ఖనిజాలు నాశనమైపోవాలిగానీ, రివర్స్​లో చందమామలో ఖనిజాలు నిక్షిప్తం అయినట్టు చెబుతూ ఉన్నారు. వాటిని అంచనా వేయడానికి బ్రెనాన్​ టీం బేసిక్స్​లోకి వెళ్లింది. చంద్రుడిలోపల ఉన్న మాగ్మాతో జాబిలిపైన రాళ్లు ఎలా ఏర్పడ్డాయో పరిశోధించారు.

చల్లబడుతున్న మాగ్మా టెంపరేచర్లు (ఉష్ణోగ్రత), ఒత్తిడి (ప్రెజర్​)లతో ల్యాబ్​లో మోడల్​ తయారు చేశారు. దానిలోని సల్ఫర్​ ఎలా రాయిగా మారిందో అంచనా వేశారు. అయితే, చందమామపైన ఏర్పడిన రాళ్లలో సల్ఫర్​ తక్కువగా ఉందని గుర్తించారు. ఐరన్​ ఎక్కువగా ఉండే సల్ఫైడ్​ ఆనవాళ్లే ఎక్కువగా ఉన్నట్టు తేల్చారు. అదే సైడరోఫైల్స్​ను ఎక్కువగా కలిగి ఉన్నట్టు గుర్తించారు. కాబట్టి చంద్రుడి లోపల బంగారం వంటి విలువైన లోహాలు ఉండి ఉంటాయన్న అంచనాకు వచ్చారు. చంద్రుడి దక్షిణ ధ్రువంలో ఎన్నెన్నో ఖనిజాలున్నాయని, వాటిని అన్వేషిస్తే చాలా విషయాలు తెలిసే అవకాశం ఉంటుందని వివరించారు. దక్షిణ ధ్రువమే టార్గెట్​గా ఇస్రో చంద్రయాన్​ 2 ప్రయోగం చేసిన సంగతి తెలిసిందే.