కేన్సర్ చికిత్సల్లో ముఖ్యమైనది కీమోథెరపీ. అది లేని కేన్సర్ ట్రీట్ మెంట్ లేనేలేదు. దాని వల్ల బాధితులకు విపరీతమైన నొప్పి, జుట్టు రాలిపోవడం, బక్కగైపోవడం వంటి నష్టాలున్నాయి. అయితే, అడ్వాన్స్డ్ దశలో ఉన్న కేన్సర్ కు అసలు కీమోథెరపీ అవసరమే లేదంటున్నారు నిపుణులు. కీమోథెరపీని దూరంగా పెట్టడమే మేలని సూచిస్తున్నారు . ఫిజిషియన్లు, పేషెంట్ల అభిప్రాయాలను తీసుకున్నారు ఇండియాకు చెందిన 9 మంది నిపుణులు. తర్వాత పేషెంట్ కు అనుకూలంగా ట్రీట్ మెంట్ కు సంబంధించిన జాబితాతో ‘చూసింగ్ వైజ్లీ ఇండియా: కేన్సర్ చికిత్సలో దూరం పెట్టాల్సిన పది విషయాలు’ పేరిటని వేదికను తయారు చేశారు.
ఆ స్టడీని ‘ద లాన్సెట్ ’ జర్నల్‌కు పంపించారు. కేన్సర్ ట్రీట్ మెంట్ లో దూరం పెట్టాల్సిన పది విషయాలను ఆ రిపోర్టులో పొందుపరిచారు సైంటిస్టులు. అమెరికా, కెనడాల్లో చేపట్టిన ‘చూసింగ్ వైజ్లీ’ అనే కార్యక్రమం స్ఫూర్తిగా నిపుణులు ఈ నివేదిక తయారు చేశారు. ఆ జాబితాలోని పది అంశాలను ఇండియా నేషనల్ కేన్సర్ గ్రిడ్ (ఎన్ సీజీ) కూడా ఆమోదించింది. కేన్సర్ ట్రీట్ మెంట్ లో సమరూప ప్రమాణాలను నిర్దేశించేందుకు నేషనల్ కేన్సర్ గ్రిడ్ పనిచేస్తోంది. దాని కింద 164 కేన్సర్ సెంటర్లు పనిచేస్తున్నాయి. అందులో భాగంగా 2017లో ఏడుగురు డాక్టర్లు , పేషెంట్ అడ్వొకసీ ఆర్గనైజేషన్లకు సంబంధించిన ఇద్దరు ప్రతినిధులతో ఈ స్టడీపై టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఆ టాస్క్‌ఫోర్స్ చేసిన స్టడీనే ఇది.
కీమోథెరపీ ఎందుకు?
అడ్వాన్స్డ్ స్టేజ్‌లో ఉన్న రోగులకు కీమోథెరపీని దూరం పెట్టాలని సైంటిస్టులు సూచించారు. అడ్వాన్స్డ్ స్టేజ్‌లో కేన్సర్ కణాలు ముదిరిపోతాయని, ఎక్కడికక్కడ అవి పెరిగిపోతాయని, అలాంటి టైంలో కీమోథెరపీ చేసినా ఫలితం
ఉండదని చెబుతున్నారు. పాలియేటివ్ కేర్ అందించడం వల్ల ట్రీట్ మెంట్ తో వచ్చే సైడ్ ఎఫెక్స్ట్ అయినా కొంచెం తగ్గుతాయని చెప్పారు.
బాధను తగ్గించే ట్రీట్మెంట్
మెటాస్టాటిక్ కేన్సర్ రోగులకు విపరీతమైన నొప్పి ఉంటుంది. ఇది కేన్సర్ లో నాలుగో దశ. శరీరంలోని ఇతర అవయవాలకూ కేన్సర్ కణాలు పాకేస్తాయి. అలాంటి రోగులకు బాధ తగ్గించేలా మానసిక సంరక్షణ (పాలియేటివ్ కేర్ ) అందడం చాలా చోట్ల ఆలస్యమవుతోంది. ఆ ఆలస్యాన్ని తగ్గించాలని నివేదికలో సైంటిస్టులు సూచించారు. ప్రారంభదశలోనే పాలియేటివ్ కేర్ అందిస్తే ట్రీట్ మెంట్ తో కలిగే బాధ, ఖర్చు తగ్గడమే కాకుండా, రోగి తాలూకు కుటుంబం కూడా సంతృప్తిగా ఉంటుందని సైంటిస్టులు తేల్చారు. అంతేకాదు, ఆ రోగులు కేన్సర్ ను జయించే రేటు కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పారు . పాలియేటివ్ కేర్ పొందే వారిపై ట్రీట్ మెంట్ ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటాయంటున్నారు .
ఎక్కువగా అవే
ప్రస్తుతం దేశంలో ఎక్కువగా నమోదవుతున్న కేన్సర్ కేసుల్లో ఓరల్(నోటి), గర్భాశయ ముఖ ద్వార కేన్సర్ , ఊపిరితిత్తుల కేన్సర్లే ఎక్కువగా ఉంటున్నట్టు నిపుణులు గుర్తించారు. సంప్రదాయ రేడియోథెరపీ చికిత్సతోనే మేలైన ఫలితాలొస్తాయని, అంతకుమించి అడ్వాన్స్డ్ రేడియోథెరపీ ఇవ్వడం కరెక్ట్ కాదని నిపుణులు తేల్చారు . అడ్వాన్స్డ్ పద్ధతుల వల్ల కేన్సర్ నుంచి రోగులు బయటపడతారనే ఆలోచన తప్పు అని వివరించారు. తక్కువ ఖర్చుతో చేసే ట్రీట్ మెంట్ తోనే మంచి ఫలితాలు వస్తున్నప్పుడు.. ఎక్కువ ఖర్చుతో చేసే చికిత్సలు ఎందుకని ప్రశ్నించారు. కేన్సర్ చికిత్స, తర్వాతి ఫాలోఅప్ కోసం ఇండియా పేషెంట్లు చాలా దూరం వెళుతున్నారని చెప్పిన నిపుణులు.. దేశంలోనే మెరుగైన వసతులు కల్పిస్తే బాగుంటుందని సూచించారు.
