పేటీఎం కొత్త ఫీచర్స్: ఇకపై బయోమెట్రిక్ UPI పేమెంట్స్.. కార్డ్ లేకుండానే ATMలో క్యాష్ విత్‌డ్రా

పేటీఎం కొత్త ఫీచర్స్: ఇకపై బయోమెట్రిక్ UPI పేమెంట్స్.. కార్డ్ లేకుండానే ATMలో క్యాష్ విత్‌డ్రా

డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం పేటీఎం తన వినియోగదారుల కోసం రెండు కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. యూపీఐ లావాదేవీల సేఫ్టీ కోసం బయోమెట్రిక్ అథెంటికేషన్, డెబిట్ కార్డ్ అవసరం లేకుండా డబ్బు విత్ డ్రా చేసుకునే 'కార్డ్‌లెస్ ఏటీఎం విత్‌డ్రాయల్' సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తెచ్చిన కొత్త టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ రూల్స్ కి అనుగుణంగా పేటీఎం ఈ మార్పులు చేపట్టింది. దీనివల్ల ఇకపై కేవలం ఓటీపీల మీదనే కాకుండా.. పిన్ లేదంటే బయోమెట్రిక్ గుర్తింపుతో పేమెంట్స్ మరింత సురక్షితం కానున్నాయి.

బయోమెట్రిక్ ఫీచర్ ద్వారా వినియోగదారులు ప్రతిసారీ యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండానే.. ఫేస్ ఐడీ లేదా ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ ద్వారా పేమెంట్స్ పూర్తి చేయవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో ఇది పనిచేస్తుంది. భద్రతా కారణాల దృష్ట్యా బయోమెట్రిక్ ద్వారా చేసే యూపీఐ చెల్లింపులపై ఒక్కో లావాదేవీకి రూ.5వేల పరిమితిని విధించారు. వినియోగదారుల ప్రైవసీని దృష్టిలో ఉంచుకుని.. వారి బయోమెట్రిక్ డేటాను పేటీఎం లేదా బ్యాంకులు స్టోర్ చేయవని కంపెనీ స్పష్టం చేసింది. ఒకవేళ పాత పద్ధతిలోనే పిన్ వాడాలనుకునే వారికి ఆ ఆప్షన్ కూడా ఇప్పటికీ అందుబాటులోనే కొనసాగనుంది.

ఇక రెండో ముఖ్యమైన ఫీచర్ కార్డ్‌లెస్ ఏటీఎం విత్‌డ్రాయల్. దీనివల్ల యూజర్లు జేబులో ఫిజికల్ ఏటీఎం కార్డు లేకపోయినా క్యాష్ తీసుకోవచ్చు. దీనికోసం ఏటీఎం మిషన్ వద్ద 'UPI Cash Withdrawal' ఆప్షన్ ఎంచుకుని.. కావాల్సిన అమౌంట్ ఎంటర్ చేయాలి. అప్పుడు స్క్రీన్ మీద కనిపించే క్యూఆర్ కోడ్‌ను పేటీఎం యాప్ ద్వారా స్కాన్ చేసి, యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే చాలు.. ఏటీఎం నుంచి నగదు బయటకు వస్తుంది. ఈ విధానంలో ఒకసారి గరిష్టంగా రూ.10వేల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. ఇది అత్యవసర సమయాల్లో కార్డు మర్చిపోయిన వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ బయోమెట్రిక్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవడం చాలా ఈజీ. పేటీఎం యాప్‌లో ప్రొఫైల్ ఐకాన్ క్లిక్ చేసి.. సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. అక్కడ మీ ఫోన్ మోడల్‌ను బట్టి పే విత్ ఫింగర్ ప్రింట్ లేదా పే విత్ ఫేస్ ఐడీ అనే ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ బ్యాంక్ అకౌంట్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. స్క్రీన్ మీద వచ్చే సూచనలు పాటిస్తే సెటప్ పూర్తవుతుంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ లావాదేవీలను సులభతరం చేస్తూనే.. సైబర్ నేరాల నుండి రక్షణ కల్పించేందుకు పేటీఎం తెచ్చిన కొత్త ఫీచర్లు యూజర్లకు ఊరటను అందిస్తోంది.