స్వాతంత్య్ర సమరానంతరం జరిగిన దేశ విభజన నేపథ్యంలో తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక చిత్రం 'బట్వారా 1947' . సన్నీ డియోల్, ప్రీతి జింటా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్‌ను చిత్రబృందం గ్రాండ్ గా రిలీజ్ చేసింది. దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి రూపొందించిన ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం, జావేద్ అఖ్తర్ సాహిత్యం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
కథేంటంటే?
1947 దేశ విభజన సమయంలో జరిగిన మత ఘర్షణలు, వలసలు, కుటుంబాల విషాద గాథను ఈ సినిమా హృదయాన్ని హత్తుకునేలా ఆవిష్కరించనుంది. ఇందులో సన్నీ డియోల్ ఓ ముస్లిం కుటుంబ పెద్దగా కనిపించగా, ప్రీతి జింటా ఆయన భార్యగా, కరణ్ డియోల్ కుమారుడి పాత్రలో నటించారు. భారత్ విభజన తర్వాత పాకిస్థాన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిన ఈ కుటుంబానికి కేటాయించిన ఇంటిలో అప్పటికే ఓ వృద్ధ పంజాబీ మహిళ (షబానా ఆజ్మీ) నివసిస్తూ ఉండటంతో కథ ఆసక్తికర మలుపు తిరుగుతుంది. ఉద్రిక్త పరిస్థితుల్లో మతోన్మాదుల నుంచి ఆమెను కాపాడేందుకు సన్నీ పాత్ర చేసే పోరాటమే చిత్రానికి ప్రధాన ఆకర్షణ.
కన్నీళ్లు పెట్టుకున్న సన్నీడియోల్..
అయితే ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి చేసిన వ్యాఖ్యలు అందరినీ భావోద్వేగానికి గురిచేశాయి. ఈ సినిమా కథను విన్న తర్వాత దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నీళ్లు పెట్టుకున్నారని, సినిమా చూసిన అనంతరం .. ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది అంటూ ఆశీర్వదించారని ఆయన గుర్తుచేశారు. ఇదే ధర్మేంద్ర చూసిన చివరి సినిమా కావొచ్చని చెప్పడంతో సన్నీ డియోల్ వేదికపైనే కన్నీళ్లు తుడుచుకోవడం అందరినీ కదిలించింది.
►ALSO READ | దేవ్ ఆనంద్ కుటుంబంలో విషాదం.. కుమారుడు సునీల్ ఆనంద్ కన్నుమూత
షబానా ఆజ్మీ ఎమోషనల్
మరోవైపు షబానా ఆజ్మీ కూడా సినిమాలో తన పాత్రకు సంబంధించిన ఓ అవమానకర సన్నివేశం గురించి మాట్లాడుతుండగా భావోద్వేగానికి గురయ్యారు. ఆ సన్నివేశంలో సన్నీ డియోల్ తనను దుపట్టాతో కప్పే సమయంలో ఆయన సహనటుడు కాదు, తనను రక్షించే కొడుకులా అనిపించాడని ఆమె ఎమోషనల్ అయింది.. అలీ ఫజల్, అభిమన్యు సింగ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది, అదే రోజున ఇమ్రాన్ హష్మీ నటించిన 'ఆవారాపన్ 2'తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది.
