హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నియోపోలీస్ ఎగ్జిట్ సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన స్విఫ్ట్ కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతిని నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువతీ యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలానికి చెందిన కత్రావత్ సురేందర్ (19), ఎల్‌బీ నగర్‌లోని ఏస్ కాలేజీలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న ప్రణీతి రెడ్డిగా గుర్తించారు.
జులై 27 రాత్రి బొమ్మలరామారం నుంచి గండిపేట్ మీదుగా కొల్లూరు వైపు వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే గచ్చిబౌలి పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, నుజ్జునుజ్జయిన కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను అతికష్టమీద బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
►ALSO READ | పెద్ది సుదర్శన్ రెడ్డి కండిషన్ సీరియస్ గానే ఉంది:హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన డాక్టర్లు
