- బోర్డు నామినేటెడ్ పదవిని మరో ఏడాది పెంచిన కేంద్రం
- జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కాంగ్రెస్.. ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ పట్టు
- 5 రోజులుగా ఎమ్మెల్యే శ్రీగణేశ్ రిలే నిరహార దీక్షలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: కంటోన్మెంట్లో రోజురోజుకు రాజకీయం వేడుక్కుతోంది. ఓ వైపు దీనిని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని పలు పార్టీలు పట్టుతుండగా, మరోవైపు నామినేటెడ్ పదవీ కాలాన్ని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ మరో ఏడాది పొడిగిస్తూ ఉత్వర్వులు జారీ చేయడం రాజకీయ రచ్చకు దారి తీసింది.
కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనంతో చేస్తేనే అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ చెబుతుండగా, కంటోన్మెంట్ కు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ ఎస్ పట్టుబడుతోంది. జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ బోర్డును విలీనం చేయాలంటూ స్థానిక ఎమ్మెల్యే శ్రీగణేశ్ 5 రోజులుగా రిలే నిరహార దీక్షలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా పదవీ కాలాన్ని ఏడాది పొడిగించడంపై బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
విలీనం కోసం ఎన్నికలకు బ్రేక్..
కంటోన్మెంట్ బోర్డుకు 2015లో ఎన్నికలు జరిగాయి. బోర్డు పరిధిలోని ఎనిమిది వార్డులకు వార్డు సభ్యులను ప్రజలు ఓటింగ్ ద్వారా ఎన్నుకున్నారు. ఈ సభ్యుల పదవీ కాలం 2020లో ముగిసింది. అప్పటి నుంచి ఎన్నికలు నిర్వహించడం లేదు. ఎన్నికల నోటిఫికేషన్ కు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ సిద్ధం కాగా, 2021 ఫిబ్రవరిలో బోర్డు చట్టంలో మార్పులు జరగడంతో బ్రేక్ పడింది.
స్థానిక ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడితో కంటో న్మెంట్ చట్టం – 2006 ప్రకారం 2023 ఏప్రిల్ 30న ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ముసాయిదాను కూడా కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ క్రమంలో కంటోన్మెంట్ బోర్డులను స్థానికంగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లలో విలీనం చేయాలన్న అంశం తెరపైకి వచ్చింది. దీంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఎన్నికలకు బ్రేక్ ఇచ్చారు.
నామినేటెడ్ సభ్యులతో బోర్డు నిర్వహణ..
కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న ప్రక్రియ పూర్తి కావడం లేదు. అటు జీహెచ్ఎంసీలో విలీనం కాకపోవడంతో పాటు ఇటు బోర్డుకు ఎన్నికలు జరగడం లేదు. 2020లో బోర్డు పాలక మండలి రద్దు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నామినేటెడ్ సభ్యులతోనే బోర్డును కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం బోర్డు సివిలియేన్ నామినెటెడ్ మెంబర్ గా భానుక నర్మద మల్లికార్జున్ కొనసాగుతున్నారు. ఈమె పదవీ కాలం వచ్చే నెలలో ముగుస్తున్న నేపథ్యంలో మరో ఏడాది పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
విలీనమా, ఎన్నికలా తేల్చండి..
కంటోన్మెంట్ బోర్డుకు ఎన్నికలు లేకపోవడంతో అభివృద్ది కుంటుపడుతోందని స్థానికులు అంటున్నారు. జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని, లేకపోతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. పాలకమండలి లేకపోవడం పౌర సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆరోపిస్తున్నారు. కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీన చేస్తే ఆస్తిపన్నులు 3.5 శాతం తగ్గింపు, రోడ్ల విస్తరణకు అవకాశముందని గుర్తుచేస్తున్నారు.
కిషన్రెడ్డి, బండి సంజయ్ స్పందించాలి: మంత్రి పొన్నం
కంటోన్మెంట్ విలీనంపై రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందించి కేంద్రానికి లేఖలు రాయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ చేపట్టిన దీక్షకు మద్దతు తెలుపుతూ శనివారం ప్రకటన విడుదల చేశారు. జీహెచ్ఎంసీలో విలీనంతోనే కంటోన్మెంట్ బోర్డు సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
ఐదో రోజు కొనసాగిన దీక్ష
పద్మారావునగర్: కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయాలంటూ ఎమ్మెల్యే శ్రీగణేశ్చేపట్టిన రిలే నిరహార దీక్షకు ఐదో రోజు శనివారం రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ దీక్షకు మద్దతు తెలిపారు. పలు మతాల పెద్దలు సంఘీభావం ప్రకటించారు.
విలీనంతోనే అభివృద్ధి...
కంటోన్మెంట్ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే జీహెచ్ఎంసీలో విలీనం కావాలి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండడం వల్ల మూడు దశాబ్దాలుగా అభివృద్ధిలో వెనుకబడింది. తాగునీరు, అంతర్గత రహదారులు, డ్రైనేజీ వంటి కనీస సౌకర్యాలు అండడం లేదు. విలీనం చేయకపోతే పోరాటం ఉధృతం చేస్తాం. - శ్రీగణేశ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే
