హైదరాబాద్: రాజేంద్రనగర్ సర్కిల్, హైదర్ షాకోట్ నుంచి గంధం గూడ వెళ్లే దారిలో మైనర్ బాలికతో కారు నడిపించి, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన ఓ పోలీసు అధికారి వ్యవహారం గంధంగూడ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. గంధంగూడ–బైరాగిగూడ ప్రధాన రహదారిపై జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
స్థానికుల కథనం ప్రకారం, TS 07 GP 7450 నంబర్ కారు అత్యంత నెమ్మదిగా, అస్తవ్యస్తంగా ప్రయాణించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కారును పరిశీలించిన స్థానికులు డ్రైవింగ్ సీట్లో ఓ మైనర్ బాలిక ఉండటాన్ని గుర్తించి వాహనాన్ని ఆపి ప్రశ్నించారు.
ఈ సందర్భంగా బాలిక "మా తాత పోలీస్" అంటూ స్థానికులతో వాగ్వాదానికి దిగినట్లు వారు తెలిపారు. పక్కనే ఉన్న పోలీసు అధికారిని ప్రశ్నించగా, ఆయన కూడా దురుసుగా స్పందించి స్థానికులతో వాగ్వాదానికి దిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మైనర్‌తో వాహనం నడిపించడం వల్ల ప్రమాదం జరిగి అమాయకుల ప్రాణాలకు ముప్పు ఏర్పడేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఉన్న పోలీసు అధికారే నిబంధనలు ఉల్లంఘించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత ఉన్నతాధికారులు విచారణ జరిపి, వాస్తవాలను నిర్ధారించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
