హైదరాబాద్ నగరంలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉప్పల్ నుండి మెహదీపట్నం వైపు బయలుదేరిన ఆర్టీసీ బస్సును... వెనుక నుంచి వచ్చిన ఒక కార్ అత్యంత వేగంగా ఢీకొట్టింది. రామంతాపూర్ పాలిటెక్నిక్ కళాశాల బస్ స్టాప్ వద్ద ప్రయాణికులను ఎక్కించుకోవడానికి ఆర్టీసీ బస్సు నిలిచి ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కార్ ఎంత వేగంతో ఉందంటే... బస్సును ఢీకొట్టిన తీవ్రతకు కారు ముందు భాగం మొత్తం బస్సు వెనుక భాగంలోకి దూసుకెళ్లిపోయింది. ఇంజన్ భాగం పూర్తిగా నలిగిపోయి కార్ నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. కారు డ్రైవర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమా? లేక డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా? లేదా బ్రేకులు ఫెయిల్ అవ్వడం వంటి సాంకేతిక లోపాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
