గ్యాస్ కోసం జనాలు క్యూ కడుతుంటే.. హోటళ్లకు అమ్ముకుంటున్న ఏజెన్సీలు..? మిర్యాలగూడలో కేసు నమోదు

గ్యాస్ కోసం జనాలు క్యూ కడుతుంటే.. హోటళ్లకు అమ్ముకుంటున్న ఏజెన్సీలు..? మిర్యాలగూడలో కేసు నమోదు

ఒకవైపు గ్యాస్ కొరతతో జనాలు ఏజెన్సీల ముందు క్యూ కడుతున్నారు. బుకింగ్స్ టైమ్ కూడా పెంచడంతో సడెన్ గా గ్యాస్ అయిపోతే పరిస్థితి ఏంటా అన్న ఆందోళనలో ఉన్నారు. జనాలకు గ్యాస్ దొరుకుతుందో లేదో కానీ.. కొన్ని ప్రాంతాల్లో హోటళ్లలో సిలిండర్లు దర్శనమిస్తున్నాయి. హోటళ్లలో సిలిండర్లు ఉండటం సహజమే. కానీ ఇంట్లో మాత్రమే వాడాల్సిన డొమెస్టిక్ సిలిండర్లు హోటళ్లలో దొరకడమే ఇక్కడ సమస్య. మిర్యాలగూడలో శుక్రవారం (మార్చి 13) పలు హోటళ్లు, రెస్టారెండ్లలో 36 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు సివిల్ సప్లై అధికారులు.

శుక్రవారం మిర్యాలగూడలో పలు హోటల్స్, రెస్టారెంట్, దాబాలపై సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా వాడుతున్న 36 డొమెస్టిక్ సిలిండర్స్ స్వాధీనం చేసుకున్నారు. హోటల్ నిర్వాహకులపై 6ఎ కేస్ నమోదు చేశారు. కమర్షియల్ కు బదులుగా డొమెస్టిక్ సిలిండర్లు వినియోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలలో కేవలం కమర్షియల్ సిలిండర్లు మాత్రమే మాడాలి. డొమెస్టిక్ సిలిండర్లు గృహావసరాలకు కేటాయించేవి మాత్రమే. కానీ వీళ్లకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు ఎలా వచ్చాయనేదే ప్రశ్నార్థకం. జనాలకు ఎక్కువ డబ్బులు ఇచ్చి ఇళ్లలో ఉండే సిలిండర్లను కొన్నారా..? లేక ఏజెన్సీలు వీరికి అమ్మాయా అనే కోణంలో  దర్యాప్తు చేస్తున్నారు. 

సూర్యాపేట జిల్లాలో కేజీ రూ.350 నుండి 500 

గ్యాస్ కొరతను క్యాష్ చేసుకోవడంలో ఈ కేటుగాళ్లు మరింత ఆరితేరారు. సూర్యాపేట జిల్లాలో గ్యాస్ బ్లాక్ దందా చూసి పోలీసులే ఆశ్చర్యపోరారు. అక్రమ గ్యాస్ ఫిల్లింగ్ కేంద్రం పై  పోలీసులు కొరడా ఝుళింపించారు. 20 కమర్షియల్ , 20 డొమెస్టిక్ సిలిండర్లు, ఫిల్లింగ్ పరికరాల పట్టుకున్నారు. 

డొమెస్టిక్ నుంచి కమర్షియల్ సిలిండర్లకు గ్యాస్ నింపి అధిక ధరకు అమ్ముతున్న కేటుగాళ్ళ పై కేసు నమోదు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా కేజీ గ్యాస్ ధర రూ.350 నుండి 500లకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు.  గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న వ్యాపారులపై కేసు నమోదు చేశారు పోలీసులు.