- ఫస్ట్ ప్రయారిటీ ఓటు కంపల్సరీ వేయాలి
- బ్యాలెట్పై నంబర్స్ తప్ప ఇంకేం రాయొద్దు
- పోలింగ్ ఆఫీసర్ ఇచ్చే వయోలెట్ కలర్
- స్కెచ్ పెన్నుతోనే నంబర్ వేయాలి
- ఒకే ప్రయారిటీ నంబర్ ఇద్దరు, ముగ్గురికి ఇవ్వొద్దు
- ఏ మాత్రం తేడా చేసినా ఓటు చెల్లదు
హైదరాబాద్, వెలుగు: జనరల్ ఎలక్షన్స్తో పోలిస్తే గ్రాడ్యుయేట్ఎమ్మెల్సీ ఓటింగ్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది. ఓటు వేసేటప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది చెల్లకుండా పోయే అవకాశం ఉంది. ఈసారి ఖమ్మం, నల్గొండ, వరంగల్ సీటుకు 71 మంది, మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ స్థానానికి93 మంది పోటీలో ఉండటంతో బ్యాలెట్పేపర్ న్యూస్పేపర్ సైజ్లో ఉండనుంది. దీంతో మనం ఓటు వేయాలనుకున్న క్యాండిడేట్ పేరు ఎక్కడుందో వెతుక్కోవడం, ప్రాధాన్యతా క్రమంలో ఇద్దరు ముగ్గురికి నంబరింగ్ ఇవ్వడం, ఓటు వేశాక సరైన పద్ధతిలో మలవడం జాగ్రత్తగా చేయాలి.
పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ పేపర్తోపాటు ఇచ్చే వయోలెట్ కలర్ స్కెచ్పెన్నుతో మాత్రమే ఓటు వేయాలి. ఇతర పెన్నులు, పెన్సిళ్లు వాడొద్దు. ఇతర పెన్నులతో ఓటు వేస్తే అది చెల్లదు.
ఫస్ట్ ప్రియారిటీ ఓటు వేయాలనుకున్న క్యాండిడేట్పేరుకు ఎదురుగా ఉన్న బాక్సులో ‘1’ నంబర్ వేయాలి.
ఆ తర్వాతే మీ చాయిస్ను బట్టి ‘2’, ‘3’, ‘4’, ‘5’.. ప్రయారిటీ ఓట్లను ఇతర క్యాండిడేట్ల పేర్ల పక్కనున్న బాక్స్లో వేయాలి.
ఇంటర్నేషనల్, ఇండియన్, రోమన్ లేదా రాజ్యాంగం గుర్తించిన ఏ ఇతర భాషల నంబర్లను అయినా బాక్స్లో వేయొచ్చు. కానీ కౌంటింగ్కు ఇబ్బంది లేకుండా అందరూ 1, 2, 3... అంకెలనే వేయాలని అధికారులు సూచిస్తున్నారు.
ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేసి, ఇతర క్యాండిడేట్లకు ప్రాధాన్యత ఓటు వేయకున్నా ఏం కాదు. ఒకటి, రెండు ప్రయారిటీలు ఇచ్చి మూడోది ఇవ్వకున్నా పర్వాలేదు. ఎన్ని ప్రయారిటీ ఓట్లు వేసినా నంబరింగ్ మాత్రం వరుసగా ఉండాలి. ‘1’, ‘2’ ప్రయారిటీలు ఇచ్చి మూడోది ఇవ్వకుండా ‘4’ ప్రయారిటీ ఇస్తే.. రెండో ప్రయారిటీ ఓటు వరకే కౌంట్ అవుతుంది. ఆ తర్వాత దాన్ని పక్కన పెడతారు.
ఎన్నికల అధికారి సూచించిన దాని ప్రకారమే బ్యాలెట్ పేపర్ను జాగ్రత్తగా మడత పెట్టి బాక్సులో వేయాలి.
ఈ తప్పులు చేయొద్దు
- ఫస్ట్ ప్రయారిటీ ఓటు (1) వేయకుంటే ఆ ఓటును రిజెక్ట్ చేస్తారు. 1 అంకె వేయకుండా 2, 3, 4.. వేస్తే ఆ ఓటు చెల్లదు.
- ఒక క్యాండిడేట్కు ఇచ్చిన నంబర్ మరో క్యాండిడేట్కు ఇవ్వొద్దు. ఒకే నంబర్ ఇద్దరు, ముగ్గురికి వేస్తే ఆ ఓటు చెల్లదు.
- బాక్స్లో కేవలం నంబర్ మాత్రమే వేయాలి. టిక్, రౌండప్, సంతకం, వేలి ముద్ర, ఇంటూ మార్క్, పేర్లు, గీతలు, చుక్కలు రాయొద్దు. అంకెను అక్షరాల్లో రాయొద్దు. బ్యాలెట్పై ఏమైనా రాసినట్లు గుర్తిస్తే ఓటును రిజెక్ట్ చేస్తారు.
