కాలీఫ్లవర్ ఈ పేరు వినగానే ‘‘గోబీ మంచూరియా చేసుకుంటే సూపర్ ఉంటుంది” అంటారు కొందరు. మరికొందరేమో ‘‘గోబీ ఆలూ, గోబీ మసాలా, గోబీ 65....’’ ఇలా వాళ్లకి నచ్చిన ఐటమ్స్ లిస్ట్ చెప్పేస్తారు. చాలామంది కాలీఫ్లవర్ని కర్రీ, ఫ్రైలా చేసినా తినరు.. కానీ, మంచూరియా, పికిల్స్లా చేస్తే మాత్రం లాగించేస్తారు. ఇంత పాపులర్ అయిన కాలీఫ్లవర్ హిస్టరీ తిరగేస్తే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి.
దాదాపు 2,300 ఏండ్ల నాటి కాలీఫ్లవర్.. ఆసియా ఖండానికి వచ్చి 200 ఏండ్లయింది. ఆసియా, మధ్యధరా సముద్రం చుట్టుపక్కల ప్రాంతాల్లో పెరిగింది. అక్కడి నుంచి ప్రపంచంలోని ఆయా ప్రాంతాలకు వెళ్లింది. అప్పటి నుంచి ఇంగ్గండ్ గార్డెన్స్‌లో కాలీఫ్లవర్ పెంపకం పెరిగింది. ఇస్తాంబుల్ వీధుల్లోనూ వీటిని అమ్మేవాళ్లు. 1500ల కాలంలో యూరప్‌లో కాలీఫ్లవర్ పండించడం మొదలుపెట్టారు.17వ శతాబ్దంలో ఫ్రెంచ్ అరిస్టోక్రాట్ల కిచెన్‌లో కాలీఫ్లవర్ సాస్ తయారుచేశారు. ఫ్రెంచ్ రాజు14వ లూయీ, ‘కాలిఫ్లవర్‌ని మెత్తగా చేసి, జాజికాయ, సువాసన కలిగిన సూప్‌లో వేసి.. కరిగించిన వెన్నతో వడ్డించమ’ని చెప్పాడట.1822లో మొట్టమొదటిసారి కాలిఫ్లవర్ విత్తనాలు నాటారు మనదేశంలో. అప్పట్లో ఇది పోర్చుగీస్ నుంచి వచ్చే నౌకల ద్వారా మనదేశానికి వచ్చింది. అంటే.. బ్రిటిష్ వాళ్ల ద్వారా మనకు పరిచయమైందని చెప్పొచ్చు. లండన్‌లోని క్యూ గార్డెన్‌కి చెందిన బొటానిస్ట్ డాక్టర్ జెమ్సన్, యునైటెడ్ ప్రావిన్స్‌లోని సహరన్‌పూర్‌లో ఉన్న గార్డెన్స్‌ని చూసుకునేవాడు. ఇప్పుడది ఉత్తర్ ప్రదేశ్‌లో ఉంది. అలా మొదట మనదేశానికి వచ్చిన కాలీఫ్లవర్, ఇక్కడి నుంచి చాలా చోట్లకు విస్తరించింది.19వ శతాబ్దం చివరిలో బ్రిటీష్ వాళ్లతోపాటు, మనవాళ్లు కూడా కాలీఫ్లవర్, క్యాబేజీ వంటల గురించి పుస్తకాలు రాశారు. ఆ తర్వాత వచ్చిన కుక్ బుక్స్‌లో కూడా కాలీఫ్లవర్ గురించి చాలా బాగా చెప్పారు రైటర్స్. బెంగాలీలు కాలీఫ్లవర్తో చాలా వెరైటీలు చేస్తారు. వింటర్లో, పండుగల్లో కూడా దీంతో బోలెడు వంటలు చేస్తారు.
