న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన 2026-నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కెమిస్ట్రీ ప్రొఫెసర్ పీవీ కులకర్ణిని ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో ప్రొఫెసర్ మనీషా గురునాథ్ మంధారేను సీబీఐ అరెస్ట్ చేసింది. మాస్టర్ మైండ్ పీవీ కులకర్ణితో పాటు ఇతర నిందితుల సమాచారం ఆధారంగా ఆమెను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. మనీషాను అదుపులోకి తీసుకోవడంతో నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో అరెస్టుల సంఖ్య 9కి చేరుకుంది.
2026 నీట్-యూజీ ప్రవేశ పరీక్షకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పేపర్-సెట్టింగ్ కమిటీలో మనీషా సభ్యురాలని సీబీఐ అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రలోని పుణెకు మనీషా బొటనీ లెక్చరర్. 2026 నీట్ యూజీ క్వశ్చన్ పేపర్లో బొటనీ, జువాలజీ ప్రశ్నల తయారీలో ఆమెది కీలక పాత్ర.
ప్రస్తుతం పూణేలోని మోడరన్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ అండ్ కామర్స్‌లో ఆమె పనిచేస్తున్నారు. గత ఐదు, ఆరు సంవత్సరాలుగా NTA తరపున నీట్ ప్రశ్నపత్రాల తయారీలో ఆమె పాల్గొంటున్నారు. పుణెలో తన ఇంట్లోనే మనీషా నీట్ కోచింగ్ సెంటర్ నడుపుతున్నారు. కొందరితో కలిసి డబ్బులకు నీట్ ప్రశ్నలకు లీక్ చేస్తోన్నట్లు అధికారులు గుర్తించారు.
