న్యూఢిల్లీ: బాధ్యతాయుతమైన సైబర్ సెక్యూరిటీ పరిశోధనకు అరుదైన గుర్తింపు లభించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) మార్కుల అప్‌లోడ్ పోర్టల్‌లో కీలకమైన భద్రతా లోపాలను గుర్తించి వెలుగులోకి తెచ్చిన 19 ఏండ్ల యువకుడు నిసర్గ అధికారిని దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఐఐటీ కాన్పూర్ తమ సంస్థలోకి ఆహ్వానించింది.
ఐఐటీ కాన్పూర్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ విభాగమైన ‘సీ–3 ఐహబ్’లో అతనికి ‘ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ అండ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ ఇంజినీర్’ గా ఉద్యోగం లభించింది. ఇటీవల సీబీఎస్‌ఈ పోర్టల్‌లోని లోపాలను దుర్వినియోగం చేయకుండా, నైతిక విలువలతో అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా నిసర్గ జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచాడు. అంతేకాకుండా, ఈ పోర్టల్ భద్రత డొల్లతనాన్ని నిరూపించడానికి అందులో ఒక వైరల్ యానిమేషన్‌ను ప్లే చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
కేవలం డిగ్రీ సర్టిఫికెట్లకే పరిమితం కాకుండా, ప్రాక్టికల్ నైపుణ్యాలు, నైతికత ఉన్న యువతకు సైబర్ రంగంలో అద్భుతమైన అవకాశాలు ఉంటాయని నిసర్గ నియామకం నిరూపించింది. సాంకేతిక పరిజ్ఞానం, తెలుసుకోవాలనే తపన ఉంటే సైబర్ సెక్యూరిటీ రంగంలో వయస్సుతో సంబంధం లేకుండా రాణించవచ్చని ఈ యువ పరిశోధకుడు తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు.
