
- ప్రకటించిన కేంద్రం.. సెంట్రల్ వాటా రూ. 192.22 కోట్లు
- పీఎం పోషణ్ పీఏబీ మినిట్స్ రిలీజ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2025–26 విద్యాసంవత్సరానికిగానూ మిడ్డెమీల్స్ స్కీమ్ (పీఎం పోషణ్) అమలు కోసం కేంద్రం రూ.307 కోట్లు ప్రకటించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.192.22 కోట్లు ఇవ్వనుండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.115.63 కోట్లు భరించనున్నది. గత నెల 17న ఢిల్లీలో పీఎం పోషణ్ ప్రోగ్రామ్ అప్రూవల్ బోర్డు (పీఏబీ) సమావేశం జరగ్గా, తెలంగాణ నుంచి విద్యాశాఖ సెక్రెటరీ యోగితా రాణా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి తదితరులు అటెండ్ అయ్యారు.
ఇందుకు సంబంధించిన మినిట్స్సోమవారం రిలీజ్ అయ్యాయి. తెలంగాణలో మిడ్డేమీల్స్ స్కీమ్ అమలు తీరుపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఈ స్కీమ్ అమలు చేస్తుండగా, కేంద్ర ప్రభుత్వం 8వ తరగతి వరకు నిధులు ఇస్తున్నది. మిగిలిన 9,10 క్లాసులకు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది. కాగా, వచ్చే విద్యాసంవత్సరంలో 228 వర్కింగ్ డేస్‌కు 12,46,598 మంది విద్యార్థులకు ఈ స్కీమ్ కింద నిధులను కేటాయించనున్నట్టు కేంద్రం ప్రకటించింది.
కిచెన్ కమ్ స్టోర్స్ నిర్మాణంపై ఆందోళన
రాష్ట్రంలో 30,408 కిచెన్ కమ్ స్టోర్స్ నిర్మాణానికి 2006 నుంచి 2012 వరకు రూ.234.69 కోట్లు కేంద్రం ఇవ్వగా, డిసెంబర్ 2024 వరకు కేవలం 17,761 కిచెన్ కమ్ స్టోర్స్ నిర్మాణం మాత్రమే పూర్తయ్యింది. మరో 3,420 స్టోర్స్ కు పనులు జరుగుతుండగా, 9,227 చోట్ల ప్రారంభం కాలేదు. దీనిపై కేంద్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రారంభం కాని స్టోర్స్ నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులను వడ్డీతో సహా వెనక్కి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా 25,901 స్కూళ్లుండగా, వాటిలో కేవలం 2,926 (11%) బడుల్లోనే కిచెన్ గార్డెన్స్ మాత్రమే ఉన్నాయని, ఇది దారుణమైన పరిస్థితి అని కేంద్రం వాపోయింది.
హైదరాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, ములుగు, కామారెడ్డి, సూర్యాపేట, మంచిర్యాల, సిద్దిపేట, రాజన్న జిల్లాల్లో 5% కంటే తక్కువ బడుల్లో ఈ కిచెన్గార్డెన్స్ ఉన్నాయని గుర్తించింది. మిడ్డేమీల్స్ నిర్వహణపై సమీక్షలు సక్రమంగా జరగడం లేదని కేంద్రం తప్పుపట్టింది. 33 జిల్లాల్లో కేవలం 7 జిల్లాల్లోనే ఎంపీ అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశాలు పది మాత్రమే జరిగాయని తెలిపింది. కలెక్టర్ అధ్యక్షతన జరిగే జిల్లా మానిటరింగ్ సమావేశాలు కూడా కేవలం 11 జిల్లాల్లోనే నిర్వహించడం సరికాదని అన్నది.
రాష్ట్రానికి ప్రశంసలు
రాష్ట్రంలో కొన్నేండ్ల నుంచి 50,407 యూనిట్ల కిచెన్ యూనిట్ల ఏర్పాటుకు కేంద్రం నిధులు మంజూరు చేయగా, అన్ని స్కూళ్లలోనూ పరికరాలు కొనుగోలు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం అభినందించింది. ‘తిథి భోజన్’ ప్రోగ్రామ్ కింద పుట్టినరోజులు, వార్షికోత్సవాల సందర్భంగా 4,843 బడుల్లో పౌష్టికాహారం/ పండ్లను అందించారని, దీనిద్వారా సుమారు 2.36 లక్షల మంది ప్రయోజనం పొందారని కేంద్రం తెలిపింది. వారంలో పిల్లలకు 3 సార్లు గుడ్లు, మరో 3 రోజులు ఫ్లెక్సీ ఫండ్ కాంపోనెంట్ కింద రాగిజావా అందించడాన్ని కేంద్రం అభినందించింది. పిల్లలకు ఆరోగ్య పరీక్షల నిర్వహణలో తెలంగాణ ముందున్నదని, మొత్తం 15.55 లక్షల మందిలో 99 శాతం మందికి పరీక్షలతోపాటు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేయడం ప్రశంసనీయమని పేర్కొన్నది.