బెట్టింగ్, ఆన్ లైన్ గేమ్స్ రివ్యూలు ఇవ్వొద్దు.. ఇన్ ఫ్లూయెన్సర్లకు కేంద్రం వార్నింగ్

బెట్టింగ్, ఆన్ లైన్ గేమ్స్ రివ్యూలు ఇవ్వొద్దు.. ఇన్ ఫ్లూయెన్సర్లకు కేంద్రం వార్నింగ్

బెట్టింగ్ యాప్​ల వల్ల , జూదం వల్ల ప్రాణాలు పోగొట్టుకున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. ఈ డిజిటల్ యుగంలో కంటెంట్ క్రియేటర్స్​, యూట్యూబర్స్ సోషల్ మీడియా ఇన్‌‌‌‌ఫ్లుయెన్సర్స్​గా ప్రజలను ప్రభావితం చేయగలుగుతున్నారు. లక్షలాది మంది ఫాలోవర్స్​ను సొంతం చేసుకుంటున్నారు. దీంతో పలు సంస్థలు తమ ఉత్పత్తుల ప్రచారం కోసం సోషల్ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్లపై ఆధారపడుతున్నాయి. బ్రాండ్ ప్రమోషన్స్​ కోసం పెద్ద మొత్తంలో చెల్లిస్తున్నాయి. అయితే  కొందరు ఇన్‌‌‌‌ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్​, గ్యాంబ్లింగ్​ యాప్స్​లను​ ప్రమోట్ చేస్తూ ఎంతోమంది ప్రాణ, ఆర్థిక నష్టానికి కారణమవుతున్నారు. 

బెట్టింగ్, గ్యాంబ్లింగ్​ వంటి ప్రకటనలకు దూరంగా ఉండాలని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్​ మీడియాలకు డిసెంబర్ లో కేంద్రం  స్పష్టం చేసింది.  కానీ ఈ ఆదేశాలను ధిక్కరిస్తూ ఆన్​లైన్​ బెట్టింగ్ యాప్​ సంస్థలు యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్లతో ప్రమోట్ చేయిస్తున్నాయి.  యూట్యూబర్స్​ కేంద్రం ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కుతున్నారు.   

ఈ నేపథ్యంలో  సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఇవాళ  కేంద్ర సమాచార శాఖ హెచ్చరికలు జారీ చేసింది.  ఆన్ లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్,  జూదానికి సంబంధించి.. వినియోగదారులను ప్రభావితం చేసే  ప్లాట్ ఫారమ్ లను ప్రోత్సహించవద్దని..అలాగే వాటికి ప్రచారం చేయొద్దని  వార్నింగ్ ఇచ్చింది.  ఆన్ లైన్  బెట్టింగ్, జూదానికి సంబంధించిన రివ్యూలు యూత్ ను  సామాజికంగా ఆర్థికంగా  ప్రభావితం చేస్తాయని సూచించింది. 

ఎవరైనా  ఆదేశాలను పాటించకపోతే  వినియోగదారుల రక్షణ చట్టం, 2019లోని నిబంధనల ప్రకారం విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది. అలాగే సోషల్ మీడియాలో ఇన్ ఫ్లూయెన్సర్స్ కు  సంబంధించిన  సోషల్ మీడియా పోస్ట్‌లు లేదా  అకౌంట్లను  తొలగించడం లేదా నిలిపివేయడం,   చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.అయినప్పటికీ ఒకవేళ ఎవరైనే నిబంధనలు  ఉల్లంఘిస్తే వారికి భారీ జరిమానా విధిస్తామని వెల్లడించింది.