అమెరికా ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ స్థానంలో తాత్కాలిక సుప్రీం లీడర్ గా అయతుల్లా అలీరెజా అరాఫీ నియమితులయ్యారు. అరాఫీ ఖమేనీ సన్నిహిత వర్గంలో ఒకరని సమాచారం. ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్ గా నియమితులయ్యాక అరాఫీ ముగ్గురు సభ్యుల లీడర్షిప్ కౌన్సిల్ లో చేరారు. ఖమేనీ స్థానంలో అరాఫీ తాత్కాలిక సుప్రీం లీడర్ గా నియమితులైనట్లు ప్రకటించింది ఇరాన్ మీడియా.
అరాఫీ ప్రస్తుతం ఇరాన్ మదర్సా వ్యవస్థకు అధినేతగా, గార్డియన్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు. విద్యావవస్థలో అరాఫీకి ఉన్న అనుభవం,శియా సమాజంలో ఆయనకున్న ప్రభావం కారణంగా తాత్కాలిక సుప్రీం లీడర్ గా నియమితులైనట్లుగా తెలుస్తోంది. అరాఫీ నియామకం ఇరాన్ రాజకీయాల్లో కీలక పరిణామంగా నిలుస్తుంది.అరాఫీ నాయకత్వంలో దేశంలో శాంతి, స్థిరత్వం తీసుకొస్తుందా అన్న ఆసక్తి అంతర్జాతీయంగా నెలకొంది.
ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ దేశ పాలన వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ముగ్గురు సభ్యులతో కౌన్సిల్ ఏర్పాటు చేశారు. ఈ కౌన్సిల్ కు అధ్యక్షుడిగా మసూద్ పెజెష్కియాన్, జ్యుడీషియరీ చీఫ్ గులాంహుస్సేన్ మొహసెని ఎజెయ్, గార్డియన్ కౌన్సిల్ జ్యూరిస్ట్ ఉంటారని ఇరాన్ మీడియా పేర్కొంది. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం 88 మంది సభ్యులున్న అసెంబ్లీ ఆఫ్ ఎక్స్ పర్ట్స్ సుప్రీం లీడర్ ను ఎన్నుకునే వరకు అరాఫీ తాత్కాలిక సుప్రీం లీడర్ గా కొనసాగనున్నారు.
