- గ్రామ పంచాయతీల బలోపేతానికి కేంద్రం ప్రత్యేక కార్యక్రమం
- రూ.50 లక్షల ఆదాయం ఉన్న పంచాయతీలపై కేంద్రం ఫోకస్
- ప్రభుత్వ నిధుల కోసం ఎదురుచూడకుండా స్వయం సమృద్ధి సాధించేలా ప్రణాళికలు
- ఈ- గ్రామ స్వరాజ్ పోర్టల్‌లో ప్రపోజల్స్ పంపితే నాబార్డ్ నుంచి నిధులు
- సంతలు, ఫంక్షన్‌హాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లతో ఆదాయ వనరులు పెంచుకునే చాన్స్
హైదరాబాద్, వెలుగు : గ్రామ పంచాయతీలను మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ గ్రాంట్లు, 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం పంచాయతీలు ఎదురుచూడకుండా ఆర్థిక పరిపుష్టి సాధించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. పంచాయతీలు ఆర్థికంగా ఎవరిపైనా ఆధారపడకుండా, తమకు ఉన్న వనరులతోనే ఆదాయాన్ని సృష్టించుకునేలా కేంద్ర ప్రభుత్వం ‘ఆత్మ నిర్భర్ పంచాయతీ’ కార్యక్రమాన్ని తెరపైకి తీసుకొచ్చింది. పన్నుల వసూలు, స్థానిక వ్యాపారాలు, డిజిటలైజేషన్ ద్వారా స్వయం సమృద్ధి సాధించిన గ్రామాలను ఈ జాబితాలో చేరుస్తోంది.
ఏటా రూ.50 లక్షల కంటే ఎక్కువ సొంత ఆదాయం ఉన్న పంచాయతీలను ఈ కార్యక్రమం కింద మరింత బలోపేతం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘ఈ– గ్రామ స్వరాజ్’ పోర్టల్‌లో ఆత్మనిర్బర్ పంచాయతీల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం గ్రామానికి వస్తున్న ఆదాయం ఎంత ? ఇంకా పెరగాలంటే ఏం చేయాలి ? అనే అంశాలను ఇందులో చేర్చాలి. ఇందుకు ప్రస్తుత సర్పంచ్‌తో పాటు ఆయనపై పోటీ చేసిన ఓడిపోయిన అభ్యర్థి, మాజీ సర్పంచ్ అభిప్రాయాన్ని సైతం తప్పనిసరిగా తీసుకోవాలి.
గ్రామ సభ ఏర్పాటు చేసి ఏకగ్రీవ తీర్మానంతో ప్రతిపాదనలను పంపించాలి. అయితే, ఆదాయం పెంచుకునే క్రమంలో అటవీ భూములు, పురాతన వారసత్వ కట్టడాలను ముట్టుకోవద్దని కేంద్రం స్పష్టం చేసింది. వాటిని పాడు చేయకుండా, నిబంధనలకు లోబడి పర్యాటక అభివృద్ధికి మాత్రమే వాడుకోవాలని సూచించింది.
గ్రామాల్లో ఉన్న ప్రత్యేకతలను బట్టి ఆదాయ మార్గాలను సర్పంచులు ప్రతిపాదిస్తే.. కేంద్ర నుంచి ఓ టీమ్ ఆ గ్రామాన్ని సందర్శించి ఆదాయ వనరులు పెంపొందించడానికి ఎలాంటి సోర్స్ఉందనేది పరిశీలిస్తోంది. అందుకు కావాల్సిన నిధులను నాబార్డ్ ద్వారా సమకూర్చే చాన్స్ ఉంది.
రాష్ట్రంలో 48 పంచాయతీలకు రూ.50 లక్షలకుపైగానే ఆదాయం
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 48 గ్రామ పంచాయతీలు రూ.50 లక్షలకు పైగా వార్షిక ఆదాయం సమకూరుతున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల పరిధిలోని పంచాయతీలకు రియల్ ఎస్టేట్, లేఅవుట్లు, వాణిజ్య సముదాయాల ద్వారా భారీగా ఆదాయం వస్తోంది. ఈ పంచాయతీల సర్పంచులతో ఇటీవల నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఆదాయ మార్గాలను మరింత పెంచుకోవడంపై దిశానిర్దేశం చేశారు. దీంతో గ్రామానికి ప్రస్తుతం వస్తున్న ఆదాయం ఎంత ? భవిష్యత్‌లో ఆదాయం పెరగాలంటే చేపట్టాల్సిన ప్రాజెక్టులేంటి ? అనే అంశాలను డిజిటలైజ్ చేస్తున్నారు.
రాష్ట్రం నుంచి సుమారు 20 గ్రామాల డెవలప్‌మెంట్ ప్రపోజల్స్ రెడీ చేసినట్లు తెలిసింది. ఉదాహరణకు నిజామాబాద్ జిల్లా నందిపేట గ్రామ పరిధిలో పురాతన కోట సమీపంలో మంచి నీరు- ఉప్పు నీరు వచ్చే రెండు బావులున్నాయి. దీన్ని పర్యాటక కేంద్రంగా మారిస్తే సందర్శకుల ద్వారా పంచాయతీకి ఆదాయం వస్తుందని సర్పంచ్ ప్రతిపాదించారు. నిర్మల్ జిల్లాలోని ఓ గ్రామంలో గొర్రెలు, మేకల సంత (అంగడి)కు రాష్ట్ర స్థాయిలో డిమాండ్ ఉంది.
కానీ సరైన స్థలం, వసతులు లేవు. మంచి షెడ్లు, మౌలిక వసతులు కల్పించాలని ప్రతిపాదించారు. పంచాయతీ ఆధ్వర్యంలో ఫంక్షన్ హాళ్లు, ఫొటో స్టూడియోలు, జిరాక్స్ సెంటర్లు, కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్సుల నిర్మాణం ద్వారా ఆదాయం పెంచుకోవచ్చని ప్రతిపాదనలు వచ్చాయి.
ఐడియాలు పోర్టల్ ద్వారా...
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘ఈ-గ్రామ స్వరాజ్’ పోర్టల్‌లో పంచాయతీల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ egramswaraj.gov.in ఓపెన్ చేసి, పంచాయతీకి కేటాయించిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. పోర్టల్‌లోని ‘ప్లాన్’ అనే సెక్షన్‌లోకి వెళ్లి, ‘రెవెన్యూ’ ట్యాబ్‌లో గ్రామానికి వస్తున్న సొంత ఆదాయం వివరాలను నమోదు చేయాలి. పన్నులు, అంగడి ఫీజులు, పారిశుధ్య రుసుము వంటివి ఎంత వస్తున్నాయో ఎంటర్ చేయాలి.
తర్వాత డెవలప్‌మెంట్ ప్లాన్ అప్‌లోడ్ చేయాలి. ‘యాక్షన్ ప్లాన్’లోకి వెళ్లి, కొత్త ప్రతిపాదనలను యాడ్ చేయాలి. గ్రామాన్ని బలోపేతం చేసేందుకు తీసుకున్న కొత్త నిర్ణయాలు వాటిని ‘యాక్టివ్ అవుట్‌పుట్’ కింద జోడించాలి. పారిశుధ్యం, డిజిటలైజేషన్ ద్వారా సాధించిన మార్పులను ఫొటోలతో సహా అప్‌లోడ్ చేయాలి.
ఆ తర్వాత సేవ్ అండ్ సబ్మిట్ చేయాలి. వివరాలు ఎంటర్ చేశాక ‘ఫ్రీజ్’ ఆప్షన్ నొక్కాలి. అప్పుడు అది జిల్లా స్థాయి అధికారుల (డీపీఓ) ఆమోదానికి వెళ్తుంది. వారు పరిశీలించిన తర్వాత రాష్ట్ర స్థాయి నుంచి కేంద్రానికి రిపోర్ట్ వెళ్తుంది.
