త్వరలోనే పెట్రో ధరల పెంపు ?..మే15 లోపు ప్రకటన వచ్చే చాన్స్!

త్వరలోనే  పెట్రో ధరల పెంపు ?..మే15 లోపు ప్రకటన వచ్చే చాన్స్!
  • క్రూడ్ ధరలు పెరగడంతో ప్రభుత్వానికి రోజుకు రూ.వెయ్యి కోట్ల నష్టం

న్యూఢిల్లీ: ఎన్నికలు అయిపోవడంతో కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాల వైపు అడుగులు వేస్తోంది.  పెట్రోల్, డీజిల్​ ధరలను పెంపు గురించి ఆలోచిస్తోంది. ఈ నెల 15లోపు ప్రకటన ఉండొచ్చని అధికార వర్గాలు తెలిపాయి. పశ్చిమ ఆసియాలో యుద్ధం వల్ల చమురు ధరలు విపరీతంగా పెరిగినా మనదేశం ధరలను పెంచలేదు. 

ప్రస్తుతం బ్యారెల్​ ముడి చమురు ధర 100 డాలర్లు (రూ.8,350) పైన ఉండటంతో పాత ధరలను కొనసాగించడం కష్టమని ఆయిల్​ మార్కెటింగ్​ కంపెనీలు (ఓంఎసీలు) చెబుతున్నాయి. ముడి చమురు, గ్యాస్ ధరలు పెరగడం వల్ల వీటికి రోజుకు రూ.వెయ్యి కోట్ల నష్టం వస్తోంది. గతంలో పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం వల్ల ప్రభుత్వంపై రూ.1.70 లక్షల కోట్ల భారం పడింది. 

చమురు కంపెనీల నష్టాలు ఈ క్వార్టర్ చివరికి రూ.50 వేల కోట్లకు చేరుతాయని అంచనా వేస్తున్నారు. గ్యాస్ రంగంలో నష్టాలు రూ.20 వేల కోట్లు దాటాయి. ఎల్​పీజీ సిలిండర్‌‌పై ప్రభుత్వం రూ.600 సబ్సిడీ ఇస్తోంది. ఉజ్వల లబ్ధిదారులకు అదనంగా రూ.300 భరిస్తోంది. దేశంలో ప్రస్తుతం 53.3 లక్షల టన్నుల చమురు నిల్వలు ఉన్నాయి. ఇవి 15 రోజులకు సరిపోతాయి. ఎరువుల ఫ్యాక్టరీలకు అవసరమైన గ్యాస్‌లో 70 శాతం మాత్రమే సరఫరా అవుతోంది. 

హార్మూజ్ జలసంధి మూతపడటం వల్ల రవాణా సమయం రెండు నుంచి మూడు వారాలు పెరిగింది. అంతేగాక ఖర్చులూ 20 శాతం పెరిగాయి. చైనా, జపాన్, బ్రిటన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఇప్పటికే పెట్రోల్ ధరలను 20 నుంచి 30 శాతం వరకు పెంచాయి. ధరల పెంపు వల్ల ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది.

 పెట్రోల్​లో 25 శాతం ఇథనాల్ 

ముడి చమురు దిగుమతులను తగ్గించడానికి పునరుత్పాదక ఇంధన వనరుల వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. పెట్రోల్​లో ఇథనాల్ వాటాను ప్రస్తుతమున్న 20 శాతం నుంచి 25 శాతానికి పెంచాలని  యోచిస్తోంది. 20 శాతం బ్లెండింగ్ లక్ష్యం వల్ల ఏటా 4.5 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు పొదుపు అవుతుంది. దీనివల్ల ఇప్పటికే రూ.1.5 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అయింది. ఇంజన్ల పనితీరు, వాహనాలపై ప్రభావం వంటి అంశాలను పరిశీలించి ప్రభుత్వం జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. 

దేశీయంగా ఇంధన శుద్ధి సామర్థ్యాన్ని పెంచేందుకు రాజస్థాన్ లోని బార్మర్, అసోంలోని నుమాలిగఢ్ రిఫైనరీల విస్తరణ పనులు జరుగుతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంతాల్లో మెగా రిఫైనరీ ప్రాజెక్టులను కేంద్రం ప్లాన్ చేస్తోంది. భవిష్యత్తులో ఎదురయ్యే ఇంధన కొరతను అధిగమించేందుకు వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను (ఎస్​పీఆర్​) పెంచుతోంది. గ్రీన్ హైడ్రోజన్, బయో ఫ్యూయల్స్ వంటి రంగాలను జాతీయ ప్రాధాన్యతలుగా ప్రభుత్వం గుర్తించింది.