- అప్పుడే ఆ వర్గాల సంక్షేమానికి చర్యలు చేపట్టగలదని సుప్రీం వ్యాఖ్య
- జనగణనలో కులగణనను మినహాయించాలన్న పిల్ కొట్టివేత
న్యూఢిల్లీ, వెలుగు: జన గణనలో కుల గణన నిర్వహించాలా.. వద్దా.. అనేది పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎంత మంది వెనుకబడిన తరగతుల (బీసీ) ప్రజలు ఉన్నారో తెలిస్తేనే.. వారి కోసం ఎలాంటి సంక్షేమ చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం నిర్ణయించుకోగలదని పేర్కొంది. ఈ మేరకు జన గణనలో కుల గణన చేపట్టవద్దని కోరుతూ దాఖలైన పిల్‌ను ధర్మాసనం కొట్టివేసింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న జన గణనలో కులగణన చేపట్టవద్దని గతేడాది సెప్టెంబర్‌లో సుధాకర్ గుమ్ముల సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ మేరకు కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలను ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై బుధవారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయ్ మాల్య బాగ్చి, జస్టిస్ విపుల్ పంచోలిల ధర్మాసనం విచారణ జరిపింది. అయితే... స్వయంగా వాదనలు వినిపించేందుకు పిటిషనర్ అభ్యర్థించగా ధర్మాసనం అనుమతించింది.
కుల సమాచారం రాజకీయ నేతలకు
చేరితే ప్రమాదం: పిటిషనర్
కులాలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం వద్ద కావాల్సినంత సమాచారం ఉందని, అందువల్ల కొత్తగా కుల గణన చేయాల్సిన అవసరం లేదని పిటిషనర్ సుధాకర్ గుమ్ముల అన్నారు. ప్రభుత్వ సేకరణ తర్వాత ఈ డేటా కార్పొరేట్ కంపెనీలు, పొలిటికల్ లీడర్ల చేతుల్లోకి వెళ్తే ప్రమాదంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పిటిషనర్ తీరుపై సీజేఐ అసహనం వ్యక్తం చేశారు. జన గణన ఏ విధంగా నిర్వహించాలనేది ప్రభుత్వ విధానపరమైన అంశమని తేల్చి చెప్పారు. ఎంత మంది వెనుకబడిన ప్రజలు ఉన్నారో తెలిస్తేనే ప్రభుత్వం సంక్షేమ చర్యలు తీసుకోగలదని వ్యాఖ్యానించారు. ఇలాంటి విధానపరమైన ప్రభుత్వ నిర్ణయాల్లో కోర్టు జోక్యం చేసుకోలేదని, ఇది పూర్తిగా న్యాయస్థానాల పరిధికి మించిన అంశమని పేర్కొన్నారు. అందువల్ల జన గణనలో కుల గణన మినహాయించాలని కోరుతూ దాఖలైన ఈ పిల్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు.
సుప్రీం నిర్ణయం హర్షణీయం
సామాజిక న్యాయంతో ముందుకు వెళ్తున్నాం: మంత్రి పొన్నం
కులాల లెక్కలు తేలినప్పుడు బలహీన వర్గాలకు న్యాయం : మంత్రి వాకిటి
హైదరాబాద్, వెలుగు: జనగణనలో కులగణనకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి హర్షం వ్యక్తం చేశారు. బుధవారం వారు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కులగణన నిర్వహించి “ ఎవరెంతో వారికంత ” అనే సామాజిక న్యాయంతో ముందుకు సాగుతోందన్నారు. జనగణనలో కులగణన చేపడితేనే కచ్చితమైన లెక్కల ఆధారంగా బలహీన వర్గాలకు న్యాయం చేయవచ్చని పేర్కొన్నారు.
