సోషల్ మీడియాలో ఉపాధి లెక్కలు

సోషల్ మీడియాలో ఉపాధి లెక్కలు

నిర్మల్, వెలుగు: జాతీయ ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను నివారించడంతోపాటు ఈ  పథకం అమలులో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు చెక్ పెట్టేందుకు ఇప్పటికే  కేంద్ర ప్రభుత్వం నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం(ఎన్ఎంఎంఎస్) అమలు చేస్తోంది. అయినప్పటికీ నిధుల వ్యయం, పనుల వివరాలతోపాటు ఉపాధి హామీ పథకంలో  పనిచేస్తున్న కూలీల వివరాలు, వారికి చెల్లిస్తున్న వేతనాల విషయంలో ఆరోపణలు ఇంకా కొనసాగుతున్నాయి.  దీంతో ఈ పథకాన్ని మరింత పారదర్శకంగా చేసేందుకు  కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్​రూపొందించింది. ఇందులో భాగంగా ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులకే  కాకుండా ఓడిపోయి రెండో స్థానంలో ఉన్న సమీప  అభ్యర్థులందరికీ ఉపాధి హామీ పథకం పనుల వివరాలు, పనిచేస్తున్న కూలీల సంఖ్యతోపాటు వారు పనిచేసిన రోజులు, వారికి చెల్లించిన వేతనాల వివరాలను వాట్సాప్ ద్వారా వెల్లడించేందుకు నిర్ణయించారు. 

57 లక్షల జాబ్​కార్డులు

రాష్ట్రంలోని 32 జిల్లాల్లో 12,771 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పనులు కొనసాగుతున్నాయి. మొత్తం 57.38 లక్షల జాబ్​కార్డులు జారీ చేయగా ఇందులో 121.22 లక్షల మంది సభ్యులు ఉన్నారు. 66.19 లక్షల మంది కూలీలు పనుల్లో పాల్గొంటున్నారు. రాష్ట్రంలోని మెజార్టీ గ్రామాల్లో, నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ నేతలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉపాధి హామీ పనుల్లో జరుగుతున్న అవకతవకలను వీరిలో  కొందరు ప్రోత్సహిస్తున్నారని, అధికారులపై ఒత్తిడి  తెస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్​తేవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇందులో భాగంగా ఇక నుంచి గ్రామ పంచాయతీలవారీగా ఉపాధి హామీ పనుల వివరాలన్నింటినీ తెలియజెప్పేందుకు ప్రత్యేక వాట్సాప్  గ్రూపులను ఏర్పాటు చేయనున్నారు. పంచాయతీ పరిధిలో 20 మందికిపైగా ఉపాధి కూలీలు ఉంటే  తప్పనిసరిగా వాట్సాప్ గ్రూప్  ఏర్పాటు చేయాలి. గ్రూపులకు అడ్మిన్ గా సంబంధిత గ్రామ పంచాయతీ సెక్రటరీలు కొనసాగుతారు. గ్రూపులో ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్, మండల పరిషత్ చైర్మన్, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లతోపాటు వారందరిపై  పోటీ చేసి ఓడిపోయిన సమీప ప్రత్యర్థులందరినీ చేర్చనున్నారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు కూడా సభ్యులుగా ఉంటారు. 

అక్రమాలకు అడ్డుకట్ట

ఇప్పటివరకు ఉపాధి హామీ పనులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలంటే ఆర్టీఐ ద్వారానే వీలుండేది. ప్రస్తుతం ఏర్పాటు చేయనున్న వాట్సాప్ గ్రూప్ తో అధికారంలో ఉన్నవారికే  కాకుండా ప్రతిపక్షంలో ఉన్న నేతలకు సైతం వారి పరిధిలోని గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనుల పూర్తి వివరాలు అధికారికంగా తెలుస్తాయి. దీనివల్ల పనుల్లో ఏవైనా అవకతవకలు జరిగినట్లయితే ఎప్పటికప్పుడు బాధ్యులను ప్రతిపక్ష పార్టీల నేతలు నిలదీసే అవకాశాలుంటాయి. 

గ్రూపులు ఏర్పాటు చేస్తున్నం

ఉపాధి హామీ పథకం అమలు విషయంలో పూర్తి పారదర్శకత కోసం ఇప్పటికే ఎన్ఎంఎంఎస్ విధానాన్ని అమలు చేస్తున్నాం. అలాగే పంచాయతీల స్థాయిలో ప్రజాప్రతినిధులు, ఎన్నికల్లో ఓడిపోయిన సమీప  ప్రత్యర్థులకు ఉపాధి హామీ సమాచారం అందించేందుకు వాట్సాప్​గ్రూపులు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే దీనికి సంబంధించి ఆదేశాలు జారీ అయ్యాయి. పంచాయతీ సెక్రెటరీల ద్వారా వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తాం. 

– విజయలక్ష్మి, పీడీ, డీఆర్డీవో, నిర్మల్