హైదరాబాద్, వెలుగు: టూరిజం కార్పొరేషన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సేవలను వెంటనే క్రమబద్ధీకరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, టూరిజం కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కార్పొరేషన్ ఎండీ గౌతమికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బు రాజమౌళితో కలిసి వినతిపత్రం అందజేశారు.
అనంతరం మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితిని 61 ఏళ్లకు పెంచాలని కోరారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేసి సంస్థను బలోపేతం చేయాలని, ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోని హోటళ్లు, రెస్టారెంట్లను తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
