కాంగ్రెస్​తో పొత్తు ఉంటది : చాడ వెంకట్ రెడ్డి

కాంగ్రెస్​తో పొత్తు ఉంటది : చాడ వెంకట్ రెడ్డి

కరీంనగర్, వెలుగు : ఇండియా కూటమిలో సీపీఐ ఉన్నందున రాష్ట్రంలో కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి వెల్లడించారు. కేంద్రంలో ఎన్డీఏకు అధికారమిచ్చిన తర్వాత వ్యవ స్థలన్నీ ధ్వంసమయ్యాయని ఆరోపించారు. అధికారంలో ఉన్నవాళ్లు అవినీతి చేస్తే విచారణ లేదని,  కేవలం ప్రతిపక్షాలనే టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. కరీంనగర్​లోని సీపీఐ జిల్లా ఆఫీసులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2008లోనే సీపీఐ ఎంపీ రాజ్యసభలో మహిళా బిల్లును ప్రవేశపెట్టారని, అదే బిల్లును ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఆమోదించిందని గుర్తుచేశారు. 

బీఆర్ఎస్ కార్యకర్తలకే కేసీఆర్ స్కీమ్ లు 

బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కోసమే సీఎం కేసీఆర్ స్కీమ్ లు అమలు చేస్తున్నారని వెంకట్ రెడ్డి ఆరోపించారు. వ్యవసాయం చేయనోళ్లకు రైతుబంధు ఇస్తున్నారని విమర్శించారు. అసలే లేనోళ్లకు దళితబంధు ఇయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్ నిధులు విడుదల చేయకపోవడంతో కాలేజీల్లో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పారదర్శక త లోపించిందని, గ్రూప్ 1 రద్దుతో నిరుద్యోగుల ఆశలు అడియాశలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన కరీంనగర్ కలెక్టరేట్ ముందు అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలిపారు. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా చర్చలు జరిపి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.