జగిత్యాలలో అప్పులు తీర్చడానికి చైన్ స్నాచింగ్..ఇద్దరు వృద్ధుల నుంచి 8 తులాల బంగారం చోరీ 

జగిత్యాలలో అప్పులు తీర్చడానికి చైన్ స్నాచింగ్..ఇద్దరు వృద్ధుల నుంచి 8 తులాల బంగారం చోరీ 
  • నిందితుడు జగిత్యాలలో అరెస్ట్​

చందానగర్, వెలుగు: అప్పులు తీర్చేందుకు ఓ యువకుడు చైన్ స్నాచర్​గా మారాడు. నిమిషాల వ్యవధిలో ఇద్దరు వృద్ధరాళ్ల మెడలోని పుస్తెల తాడు, గోల్డ్​చైన్​లాక్కొని పరారయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్​శివారులోని చందానగర్ పోలీస్​స్టేషన్ పరిధిలో జరగగా.. నిందితుడిని పోలీసులు అరెస్ట్​చేశారు. చందానగర్ ఠాణాలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రామచంద్రాపురం ఏసీపీ శ్రీనివాస్​కుమార్​వివరాలు వెల్లడించారు.

లింగంపల్లి ఓల్డ్ ఎంఐజీలో నివాసం ఉండే పొట్లపల్లి సత్యవతి జనవరి 31న ఉదయం కిలోమీటర్​దూరంలో ఉన్న రామాలయానికి వెళ్లింది. పూజ అనంతరం తిరిగి వస్తుండగా ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని పుస్తెలతాడు, నల్లపూసల దండ లాక్కొని పారిపోయాడు. తర్వాత 5 నిమిషాల్లోనే పక్క రోడ్డులో ఆలయం నుంచి ఇంటికి వెళ్తున్న చాగంటిపాటి జయభారతి మెడలోని గోల్డ్​చైన్​ను చోరీ చేశాడు.

బాధితురాళ్ల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని శేరిలింగంపల్లి గోపినగర్​కు చెందిన రాజేశ్​గా గుర్తించి, అరెస్ట్​ చేశారు. అప్పుల బాధ నుంచి బయటపడేందుకు చైన్​స్నాచింగ్​కు పాల్పడినట్లు ఒప్పుకున్నాడని ఏసీపీ చెప్పారు. చోరీ తర్వాత రాజేశ్​కరీనంగర్, అక్కడి నుంచి జగిత్యాలకు పారిపోయినట్లు గుర్తించి, జగిత్యాలలో అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 8 తులాల బంగారం రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. డీఐ భాస్కర్, ఎస్​వోటీ ఇన్​స్పెక్టర్​రాజశేఖర్​ఉన్నారు.