శామీర్‌పేట్, వెలుగు: బంగారు గొలుసు అనుకుని దుండగులు రోల్డ్ గోల్డ్ గొలుసును లాక్కెళ్లిన ఘటన తూర్కపల్లి జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి సోమవారం వివరాలు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లి గ్రామానికి చెందిన నాగలక్ష్మి ఈ నెల 17న మజీద్‌పూర్ బస్టాప్ వద్ద బస్సు కోసం ఎదురుచూస్తుండగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి ఆమె మెడలో ఉన్న గొలుసును లాక్కొని పరారయ్యారు. బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా దర్యాప్తు ప్రారంభించారు. దొంగిలించిన గొలుసును మేడ్చల్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో తాకట్టు పెట్టేందుకు ప్రయత్నించగా అది రోల్డ్ గోల్డ్ అని తేలింది. దీంతో నిందితులు ఆ గొలుసును తమ వద్దనే ఉంచుకున్నారు. పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. షేక్ సగీర్ అహ్మద్, విభూతి సాయి కృష్ణను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లు, ఒక కత్తి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. పోలీసులు బాధితురాలిని ప్రశ్నించగా గొలుసు నిజమైన బంగారం కాదని చెప్పడంతో ఆశ్చర్యం వ్యక్తం
చేశారు.

