వాకింగ్ కు వెళ్లే మహిళలే టార్గెట్...చైన్ స్నాచర్ల ముఠా అరెస్ట్

వాకింగ్ కు వెళ్లే మహిళలే టార్గెట్...చైన్ స్నాచర్ల ముఠా అరెస్ట్

జీడిమెట్ల, వెలుగు: వాకింగ్​కు వెళ్లే మహిళలను టార్గెట్ చేసి చైన్ స్నాచింగ్​లకు పాల్పడుతున్న ముఠాను జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి శనివారం వెల్లడించారు. ఎల్లమ్మబండలోని సిక్కు బస్తీకి చెందిన గోవింద్ సింగ్ (24), కరణ్ సింగ్ (21), హరిదీప్ సింగ్ (19)తో పాటు ఒక మైనర్, మరో వ్యక్తి జల్సాలకు అలవాటుపడి ముఠాగా ఏర్పడ్డారు. ఇందులో భాగంగా ఈ నెల 26న బీరప్పనగర్​కు చెందిన ఓ మహిళ వాకింగ్ చేస్తుండగా, నిందితులు ఆటోలో వచ్చి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. 

ఈ క్రమంలో ఆమెకు గాయాలవ్వగా, ఎవరికైనా చెబుతుందేమోనన్న అనుమానంతో బాధితురాలి ఫోన్​ను కూడా పగలగొట్టారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసి, రెండు తులాల బంగారు గొలుసు, ఒక ఆటో, స్కూటర్ స్వాధీనం చేసుకున్నారు. వీరు ముందుగా ఒక మోటార్ సైకిల్, ఆ తర్వాత ఒక ఆటోను దొంగిలించి, ఆ వాహనాల్లో తిరుగుతూ నేరాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. ఈ ముఠాలో మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేయగా, మరొక వ్యక్తి పరారీలో ఉన్నాడని డీసీపీ తెలిపారు.