తెలంగాణపై నితిన్ నబీన్‌‌ కు అవగాహన లేదు : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

తెలంగాణపై నితిన్ నబీన్‌‌ కు అవగాహన లేదు : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
  •     తెలంగాణ కాంగ్రెస్‌‌తోనే వచ్చింది.. గూగుల్‌‌లో చూసినా తెలుస్తుంది: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
  •     రైతులు, మెట్రో, మూసీ అంశాలపై కేంద్రాన్ని నిలదీసిన ఎంపీ

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ చేసిన వ్యాఖ్యలు అవగాహన లేనివని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్​అయ్యారు. కొత్తగా బీజేపీకి అధ్యక్షుడు అయ్యారని, తెలంగాణ చరిత్రపై ఆయనకు పూర్తి అవగాహన లేదని అన్నారు. కనీసం గూగుల్‌‌లో వెతికినా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ కృషి వల్లే ఏర్పడిందని తెలుస్తుందని వ్యాఖ్యానించారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్​లో మీడియాతో ఎంపీ మాట్లాడారు.  ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కాంగ్రెస్ అగ్రనేతృత్వాన్ని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని విమర్శించారు.  రాష్ట్ర ఏర్పాటు తర్వాత పదేండ్లపాటు కేసీఆర్ తెలంగాణను దోచుకుంటే,  కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు.  

కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్​రెడ్డి తెలంగాణకు ఏమి చేశారో చెప్పాలని, రాష్ట్రానికి ఎన్ని నిధులు తెచ్చారో వివరించాలని  డిమాండ్ చేశారు. కేంద్రం తెలంగాణ రైతులు పండించిన పంటలను ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర రైతుల పట్ల బీజేపీ నేతలకు బాధ్యత లేదా అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అయిందని, ఈ విషయంలో సీఎం రేవంత్​రెడ్డి  మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరితే బీజేపీ నేతలు ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. అలాగే మెట్రో రైలు ఫేజ్-2, మూసీ ప్రక్షాళన వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఎందుకు విడుదల చేయడం లేదని నిలదీశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందించాలని డిమాండ్ చేశారు.