
- గవర్నర్ ఆమోదంతో ప్రభుత్వం ఉత్తర్వులు
- పెండింగ్‌లో కమిషనర్ల ఎంపిక
హైదరాబాద్, వెలుగు: సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) చీఫ్ కమిషనర్‌గా చంద్రశేఖర్‌రెడ్డిని నియమిస్తూ సీఎస్ రామకృష్ణారావు సోమవారం జీవో 106ను జారీ చేశారు. ప్రభుత్వం పంపిన పేరును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించటంతో ఈ ఉత్తర్వులిచ్చారు. చీఫ్ కమిషనర్ పేరుతోపాటు కమిషనర్లుగా నియమించేందుకు మరో ఏడు మంది పీవీ శ్రీనివాస్, అయోధ్య రెడ్డి, హరిప్రసాద్, రాములు, పీఎల్ఎన్ ప్రసాద్, వైష్ణవి, పర్వీన్ పేర్లతో రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపింది.
అయితే, కేవలం చీఫ్ కమిషనర్ ప్రతిపాదనకు మాత్రమే గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పలు సంస్థల నుంచి వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదుల మేరకు కమిషనర్ల ఎంపికను పెండింగ్‌లో పెట్టినట్లు తెలిసింది. దీంతో చీఫ్ కమిషనర్ నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులిచ్చింది. 1991 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన చంద్రశేఖర్‌రెడ్డి గత నెల 30 వరకు పీసీసీఎఫ్‌గా, అంతకుముందు సీఎంవో సెక్రటరీగా పనిచేశారు. చంద్రశేఖర్ రెడ్డి స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బోరెగాన్ గ్రామం.