తెలంగాణలోని 7 మండలాలను ఏపీలో విలీనం చేయించా : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

తెలంగాణలోని 7 మండలాలను ఏపీలో విలీనం చేయించా : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
  •     ఆంధ్రప్రదేశ్​ సీఎం చంద్రబాబునాయుడు
  •     ఏపీలో కలిపితేనే సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని చెప్పిన
  •     తెలంగాణకు నేనెప్పుడూ వ్యతిరేకం కాదు
  •     తెలుగుజాతి కోసం సైబరాబాద్, హైటెక్ సిటీ నిర్మించానని వెల్లడి 

అమరావతి : నాకున్న అనుభవంతో తెలంగాణలోని 7 మండలాలను ఏపీలో విలీనం చేయించానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ‘పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపితేనే సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని చెప్పా. తెలంగాణకు నేనెప్పుడూ వ్యతిరేకం కాదు. తెలుగు ప్రజల కోసం హైదరాబాద్​ను అభివృద్ధి చేశా. తెలంగాణ ప్రజల గౌరవాన్ని పోగొట్టుకునే పని ఎప్పుడూ చేయను’ అని ఆయన చెప్పారు. శుక్రవారం ఏపీలోని గుంటూరు జిల్లా ఉండవల్లిలో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 

సమైక్యాంధ్రప్రదేశ్​లో తొమ్మిదేండ్లు సీఎంగా పని చేశానని, తెలుగుజాతి కోసం సైబరాబాద్, హైటెక్ సిటీ నిర్మించానని తెలిపారు. రెండు రాష్ట్రాల ప్రజలకు న్యాయం చేసి విభజన చేయాలని కోరానని, రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విభజించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ రాజధాని అమరావతి బిల్లుకు పార్లమెంట్​ఆమోదం తెలపడం ప్రజా విజయమన్నారు. బిల్లు ఆమోదానికి సహకరించిన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​షా, లోక్​సభ స్పీకర్​ఓంబిర్లా, రాజ్యసభ చైర్మన్​సీపీ రాధాకృష్ణన్, అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు.