- స్పీకర్ తిరస్కరించడంతో వాకౌట్
చండీగఢ్: చండీగఢ్‌లో కార్మిక దినోత్సవం సందర్భంగా జరిగిన పంజాబ్ అసెంబ్లీ సమావేశం రసాభాసగా మారింది. సీఎం భగవంత్ మాన్ మద్యం సేవించి సభకు వచ్చారని, ఆయనకు ఆల్కహాల్ టెస్ట్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరా ఫోన్ వాడుతున్నారని సీఎం మాన్ అభ్యంతరం తెలుపగా.. గతంలో సీఎం భార్య గ్యాలరీలో కూర్చుందని కౌంటర్ఇచ్చారు. దీంతో ఖైరా, సీఎం మధ్య వాగ్వాదం జరిగింది.
‘‘ ఆమె సభ్యురాలు కాదు కాబట్టి తెలియదు.. నా బిడ్డను కూడా టార్గెట్ చేస్తావా.. నీకు పిచ్చి పట్టింది” అంటూ సీఎం ఫైర్ అయ్యారు. దీంతో సీఎం మాటలు తడబడుతున్నాయని, డోప్ టెస్ట్ చేయాల్సిందేనని కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బాజ్వా, అకాలీదళ్ సభ్యులు డిమాండ్ చేశారు. అయితే స్పీకర్ ఈ డిమాండ్‌ను తిరస్కరించడంతో కాంగ్రెస్, బీజేపీ, అకాలీదళ్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
మంచి పని చేద్దామని కార్మికుల కోసం సభ పెడితే.. రచ్చ చేస్తున్నారని, విపక్షాలు బయటకు వెళ్లడానికి సాకులు వెతుకుతున్నాయని సీఎం మాన్ ఫైర్ అయ్యారు. విపక్షాలు వాకౌట్ చేసిన తర్వాత ఆప్ సర్కార్ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం ఏకగ్రీవంగా నెగ్గింది. 117 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి జై కొట్టారు. ఈ సందర్భంగా బీజేపీపై సీఎం మాన్ సెటైర్లు వేశారు. బీజేపీ దగ్గర సొంత మనుషులు లేరు, అందుకే మా వాళ్లను తీసుకుంటున్నారు. ఈ తీర్మానం కాపీని నేరుగా రాష్ట్రపతికే పంపిస్తా" అని తేల్చి చెప్పారు.
