జూబ్లీహిల్స్, వెలుగు: విదేశీ పర్యటనను తక్కువ ధరకే ఏర్పాటు చేస్తానని నమ్మించి ఓ వ్యాపారవేత్త నుంచి ఓ వ్యక్తి రూ.3.40 లక్షలకు పైగా వసూలు చేశాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-10లో నివసిస్తున్న వ్యాపారవేత్త ఎం.రతన్ కుమార్ (42), ఆయన భార్య ఎం.దివ్య సమ్మర్ వెకేషన్‌లో భాగంగా మారిషస్ పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సయ్యద్ గౌస్ మొహిద్దీన్ ఖాద్రిని సంప్రదించారు. 'ఫ్లై క్రియేటివ్' సంస్థ ద్వారా హాలిడే ప్యాకేజీ, విమాన టికెట్లు, వసతి సౌకర్యాలు తక్కువ ధరకే కల్పిస్తానని ఖాద్రి వారిని నమ్మించాడు.
2026 ఫిబ్రవరి 26 నుంచి మార్చి 20 మధ్య వివిధ దఫాల్లో మొత్తం రూ.3,40,540 అతనికి బదిలీ చేశారు. అనంతరం విమాన టికెట్లకు సంబంధించిన పీఎన్‌ఆర్ నంబర్‌ను పరిశీలించగా అది చెల్లదని తెలిసింది. దీంతో బాధితులు 'ఫ్లై క్రియేటివ్' సంస్థను సంప్రదించగా, సయ్యద్ గౌస్ మొహిద్దీన్ ఖాద్రి తమ సంస్థలో ఉద్యోగి కాదని యాజమాన్యం స్పష్టం చేసింది. డబ్బులు తిరిగి ఇవ్వాలని పలుమార్లు కోరినా మొదట కాలయాపన చేసిన నిందితుడు, తర్వాత స్పందించడం మానేశాడని బాధితులు ఆరోపించారు. జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
