గుజరాత్​లో చెడ్డీ గ్యాంగ్​ చిక్కిందా?

గుజరాత్​లో చెడ్డీ గ్యాంగ్​ చిక్కిందా?

హైదరాబాద్​, వెలుగు: పోలీసులకు దొరక్కుండా తప్పించుకుంటూ సవాల్​ విసురుతున్న చెడ్డీ గ్యాంగ్​ దొరికిందా? వరుస దోపిడీలు చేస్తూ జనానికి నిద్ర లేకుండా చేస్తున్న ముఠా ఆటకట్టించారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. హయత్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో నెల రోజుల్లోనే 7 దోపిడీలకు పాల్పడి, పోలీసుల నుంచి తప్పించుకుపోయిన గ్యాంగ్​ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయా దోపిడీలకు సంబంధించిన కేసుల దర్యాప్తును ముమ్మరం చేసిన రాచ కొండ పోలీసులు, యూపీ, బీహార్​, మధ్యప్రదేశ్​, గుజరాత్​లలో ముఠా సభ్యుల ఆచూకీ కోసం గాలించారు. ఈ క్రమంలో గుజరాత్​లో వాళ్లను పోలీసులు అరెస్ట్​ చేసినట్టు సమాచారం. అక్టోబర్​ 24, నవంబర్​ 22న కుంట్లూర్​లో దొంగల ముఠా దోపిడీలకు పాల్పడిన సంగతి తెలిసిందే.

10 స్పెషల్​ టీమ్స్​తో సెర్చ్​

చెడ్డీ గ్యాంగ్​ కేసును చాలెంజింగ్​గా తీసుకున్న రాచకొండ సీపీ మహేశ్​భగవత్​.. స్పెషల్​ టీములు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఎల్బీనగర్​ డీసీపీ సన్​ప్రీత్​సింగ్​ నేతృత్వంలోని 10 స్పెషల్​ టీములు చెడ్డీ గ్యాంగ్​ కోసం నాలుగు రాష్ట్రాల్లో గాలింపు చేపట్టాయి. సీసీఎస్​ పోలీసులతో పాటు ఎస్​వోటీ, ఐటీ సెల్​ టీములు ఉత్తర్​ప్రదేశ్​, బీహార్​, మధ్యప్రదేశ్​, గుజరాత్​లలో ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి. కుంట్లూరు చోరీ తర్వాత నిజామాబాద్​, ఏపీలో చోరీలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. చెడ్డీగ్యాంగ్​ తిరిగిన చోట సీసీటీవీ ఫుటేజ్​, వేలి ముద్రలను తీసుకున్నారు. దానికి తోడు పాత నేరస్తుల డేటా ఆధారంగా పోలీసులు చెడ్డీ గ్యాంగ్​ కదలికలను గుర్తించారు. అవే కేసు పురోగతికి తోడ్పడ్డాయని పోలీసులు
చెబుతున్నారు.

ఇవీ చెడ్డీ గ్యాంగ్​ చోరీలు

అక్టోబర్​ 24న  హైదరాబాద్‌‌ శివారులోని  హనుమాన్​నగర్​ యాజ్ఞికపీఠం వేద పాఠశాలతో పాటు మరో మూడు ఇళ్లలో చెడ్డీ గ్యాంగ్​ దోపిడీ చేసింది. ఇనుప రాడ్లు, కర్రలతో బెదిరించి దోపిడీలకు పాల్పడ్డారు. 15 తులాల నగలు, రూ.1.5 లక్షలు ఎత్తుకెళ్లారు. హనుమాన్​నగర్​ కాలనీలోని అంజిరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో 5 తులాల బంగారం, రూ.50 వేలు దోచుకెళ్లారు. తర్వాత ఓ గుడిసెలో మొబైల్​ఫోన్​, సత్తిరెడ్డికాలనీలోని యాజ్ఞిక పీఠం వేద పాఠశాలలో చోరీ చేశారు. వేద పాఠశాల నిర్వాహకులు కిశోర్​ స్వామి, ఆయన భార్యను బెదిరించి పుస్తెలతాడు, బంగారు గాజులు, కమ్మలతో పాటు రూ.లక్ష దోచుకెళ్లారు. నవంబర్​ 22న అరగంటలో రెండు ఇళ్ల తలుపులను పగులగొట్టి రాడ్లు, కర్రలు, కత్తులతో బెదిరించి దోపిడీకి పాల్పడింది. 20 తులాల బంగారం రూ.75 వేలు చోరీ చేసింది.