- గత వైసీపీ పాలకులు మహాపాపం చేశారు: చంద్రబాబు
- చర్యలు తీసుకోవాలని సీబీఐ నివేదిక ఇచ్చింది
హైదరాబాద్, వెలుగు: తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించి డబ్బులు దోచుకోవడంతో పాటు తిరుమల పవిత్రతను గత వైసీపీ పాలకులు దెబ్బతీశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. లడ్డూలో రసాయనాలు కలిపారని తెలిపారు. రసాయనాలు కలిపినట్టు సీబీఐ చార్జ్‌షీట్‌లో ఉందని స్పష్టం చేశారు.
గురువారం అమరావతిలో మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ నేతలు చేసిన తప్పును ఒప్పుకోవడానికి బదులు.. క్లీన్‌చిట్ వచ్చిందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తిరుమల లడ్డూ విషయంలో గత పాలకులు మహా పాపం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారం భక్తుల మనోభావాలకు సంబంధించినది.
గత వైసీపీ సర్కార్ పాలనలో శ్రీవారి ప్రసాదం విషయంలో అపచారం చోటు చేసుకుంది. ఏడు కొండలవాడికి రెండు కొండలు చాలు అని నాటి పాలకులు అన్నారు. భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు. తిరుమల లడ్డూలో కల్తీ జరుగుతోందని 2022లో సీఎఫ్‌టీఆర్ఐ చాలా స్పష్టంగా చెప్పినా పట్టించుకోకుండా యథేచ్ఛగా కొనసాగించారు. 2022లో వచ్చిన నివేదికను దాచిపెట్టారు. ఉద్దేశపూర్వకంగా అక్రమాలు చేయడానికే గత పాలకులు నాటి నివేదికను దాచేశారు.
గతంలో పని చేసిన చైర్మన్ పీఏ రూ.4 కోట్లు లంచంగా తీసుకున్నారు”అని సీఎం వెల్లడించారు. లడ్డూ కల్తీ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీబీఐ నివేదిక ఇచ్చింది. ఈ విషయంలో తప్పుచేసిన వారిని వదిలే ప్రసక్తే లేదు. ఈ వ్యవహారంపై ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నం. ఈ కమిటీ ఎదుట అన్ని నివేదికలు ఉంచుతాం” అని ప్రకటించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పాల్గొన్నారు.
