ప్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో ఔట్.. 5 వికెట్ల తేడాతో లక్నోపై చెన్నై గెలుపు

ప్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో ఔట్.. 5 వికెట్ల తేడాతో లక్నోపై చెన్నై గెలుపు

లక్నోపై చెన్నై సూపర్ కింగ్స్‌‌ మెరుపు విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో గెలుపొంది, ఫ్లే ఆఫ్‌‌ ఆశలను నిలుపుకుంది. కెప్టెన్ రుతురాజ్ (42), సంజూ శాంసన్ (28) స్కోర్ చేయగా, ఉర్విల్ పటేల్ 13 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ చేసి అదరగొట్టాడు. మొత్తం 2 ఫోర్లు, 8 సిక్స్‌‌లతో 65 పరుగులు చేశాడు.

చెన్నై: టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో ఉర్విల్‌‌‌‌ పటేల్‌‌‌‌ (23 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లు, 8 సిక్స్‌‌‌‌లతో 65) మెరుపు బ్యాటింగ్‌‌‌‌ చేయడంతో.. ఐపీఎల్‌‌‌‌–19లో చెన్నై సూపర్‌‌‌‌కింగ్స్‌‌‌‌ కీలక విజయాన్ని అందుకుంది. కెప్టెన్‌‌‌‌ రుతురాజ్‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌ (42), సంజూ శాంసన్‌‌‌‌ (28) అండగా నిలవడంతో.. ఆదివారం జరిగిన లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్‌‌‌‌జెయింట్స్‌‌‌‌పై గెలిచి ప్లే ఆఫ్స్‌‌‌‌ ఆశలను సజీవంగా నిలుపుకుంది. 

ఇక 11 మ్యాచ్‌‌‌‌ల్లో ఎనిమిదో ఓటమితో లక్నో నాకౌట్‌‌‌‌ రేసుకు దూరమైంది. టాస్‌‌‌‌ ఓడిన గుజరాత్‌‌‌‌ 20 ఓవర్లలో 203/8 స్కోరు చేసింది. జోస్‌‌‌‌ ఇంగ్లిస్‌‌‌‌ (33 బాల్స్‌‌‌‌లో 10 ఫోర్లు, 6 సిక్స్‌‌‌‌లతో 85) , షాబాజ్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ (25 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌లతో 43 నాటౌట్‌‌‌‌) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. తర్వాత చెన్నై 19.2 ఓవర్లలో 208/5 స్కోరు చేసి నెగ్గింది. ఓవర్టన్‌‌‌‌ (3/36)కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. 

ఇంగ్లిస్‌‌‌‌ మెరుపులు.. 
ముందుగా బ్యాటింగ్‌‌‌‌కు దిగిన లక్నోకు ఇంగ్లిస్‌‌‌‌ మెరుపు ఆరంభాన్నిచ్చాడు. పవర్‌‌‌‌ప్లేను ఉపయోగించుకుని ఫోర్లు, సిక్స్‌‌‌‌లతో సీఎస్కే బౌలర్లను ఉతికేశాడు. ఈ క్రమంలో 17 బాల్స్‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. రెండో ఎండ్‌‌‌‌లో మిచెల్‌‌‌‌ మార్ష్‌‌‌‌ (10) నిరాశపర్చినా.. పవర్‌‌‌‌ప్లేలో లక్నో 91/1తో పటిష్ట స్థితిలో నిలిచింది. 

ఈ దశలో పుంజుకున్న సీఎస్కే బౌలర్లు రన్స్‌‌‌‌ కట్టడి చేశారు. ఓ ఎండ్‌‌‌‌లో ఇంగ్లిస్‌‌‌‌ దూకుడుగా ఆడినా.. రెండో ఎండ్‌‌‌‌లో మిగతా బ్యాటర్ల పని పట్టారు. నూర్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ (1/24).. నికోలస్‌‌‌‌ పూరన్‌‌‌‌ (1)ని దెబ్బకొట్టగా, ఒకే ఓవర్‌‌‌‌లో ఓవర్టన్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ను తారుమారు చేశాడు.

ప్రమాదకరంగా మారిన ఇంగ్లిస్‌‌‌‌ను స్కూప్‌‌‌‌ షాట్‌‌‌‌ ఆడేలా ఉసిగొల్పి కీపర్‌‌‌‌ శాంసన్‌‌‌‌కు క్యాచ్‌‌‌‌ ఇచ్చేలా చేశాడు.  ఇదే ఓవర్‌‌‌‌లో ఐదో బాల్‌‌‌‌కు రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌ (15) వికెట్‌‌‌‌ తీశాడు. మధ్యలో మార్‌‌‌‌క్రమ్‌‌‌‌ (10) రనౌట్‌‌‌‌గా వెనుదిరిగినా.. 15వ ఓవర్‌‌‌‌లో అంగ్‌‌‌‌క్రిష్‌‌‌‌ రఘువంశీ (18)ని పెవిలియన్‌‌‌‌కు పంపిన ఓవర్టన్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ను శాసించాడు. ఈ దశలో నిలకడగా ఆడిన షాబాజ్‌‌‌‌ అహ్మద్‌‌‌‌.. హిమ్మత్‌‌‌‌ సింగ్‌‌‌‌ (17)తో ఆరో వికెట్‌‌‌‌కు 50 రన్స్‌‌‌‌ జోడించడంతో లక్నో స్కోరు రెండొందలు దాటింది. షమీ (0), ఆవేశ్‌‌‌‌ ఖాన్‌‌‌‌ (0 నాటౌట్‌‌‌‌) నిరాశపర్చారు.

‘టాప్‌‌‌‌’ లేపారు..
ఛేజింగ్‌‌‌‌లో సీఎస్కే టాప్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌ మెరుపులు మెరిపించింది. ఆరంభం నుంచే శాంసన్‌‌‌‌, రుతురాజ్‌‌‌‌.. షమీ, ప్రిన్స్‌‌‌‌ యాదవ్‌‌‌‌ను లక్ష్యంగా చేసుకుని బౌండ్రీలు రాబట్టారు. తొలి వికెట్‌‌‌‌కు 45 రన్స్‌‌‌‌ జత చేసి శాంసన్‌‌‌‌ వెనుదిరిగాడు. అయితే వన్‌‌‌‌డౌన్‌‌‌‌లో ఉర్విల్‌‌‌‌ పటేల్‌‌‌‌ రాకతో ఇన్నింగ్స్‌‌‌‌ వాయు వేగంతో దూసుకెళ్లింది. 

ఆవేశ్‌‌‌‌ ఖాన్‌‌‌‌ వేసిన ఓవర్‌‌‌‌లో వరుసగా మూడు సిక్స్‌‌‌‌లు కొట్టిన ఉర్విల్‌‌‌‌.. దిగ్వేష్‌‌‌‌ ఓవర్‌‌‌‌లో ఏకంగా 25 రన్స్‌‌‌‌ రాబట్టాడు. అదే క్రమంలో షమీని కూడా వదలకుండా భారీ షాట్లతో రెచ్చిపోయాడు. ఫలితంగా 13 బాల్స్‌‌‌‌లోనే హాఫ్‌‌‌‌ సెంచరీ పూర్తి చేశాడు. ఈ క్రమంలో రెండుసార్లు క్యాచ్‌‌‌‌ ఔట్‌‌‌‌ల నుంచి బయటపడ్డాడు.

97/1 స్కోరుతో పవర్‌‌‌‌ప్లేను ముగించిన సీఎస్కేకు 10 ఓవర్‌‌‌‌లో ఎదురుదెబ్బ తగిలింది. దూకుడుగా ఆడుతున్న ఉర్విల్‌‌‌‌ను షాబాజ్‌‌‌‌ ఔట్‌‌‌‌ చేయడంతో రెండో వికెట్‌‌‌‌కు 81 రన్స్‌‌‌‌ భాగస్వామ్యం ముగిసింది. 131/2తో ఫస్ట్‌‌‌‌ టెన్‌‌‌‌ ఓవర్స్‌‌‌‌ ముగించిన చెన్నై 13వ ఓవర్‌‌‌‌లో రుతురాజ్‌‌‌‌ వికెట్‌‌‌‌ను కోల్పోయింది. దాంతో స్కోరు 149/3గా మారింది. 

కార్తీక్‌‌‌‌ శర్మ (20), డేవ్లాడ్‌‌‌‌ బ్రెవిస్‌‌‌‌ (10) మెరుగ్గా ఆడే ప్రయత్నం చేసి విఫలం కావడంతో సీఎస్కే 169/5తో ఎదురీత మొదలుపెట్టింది. చివర్లో శివమ్‌‌‌‌ దూబే (15 నాటౌట్‌‌‌‌), ప్రశాంత్‌‌‌‌ వీర్‌‌‌‌ (17 నాటౌట్‌‌‌‌) బాధ్యతాయుతంగా ఆడి ఆరో వికెట్‌‌‌‌కు 39 రన్స్‌‌‌‌ జోడించి చెన్నైని విజయ తీరాలకు చేర్చారు. 

స్కోరు వివరాలు: 
లక్నో: 20 ఓవర్లలో 203/8 (ఇంగ్లిస్ 85, షాబాజ్ అహ్మద్ 43, ఓవర్టన్ 3/36). చెన్నై: 19.2 ఓవర్లలో 204/5 (ఉర్విల్ పటేల్ 65, శాంసన్ 28, దూబే 15*, షాబాజ్‌‌‌‌ 2/30).

ఐపీఎల్‌‌‌‌లో అత్యంత వేగంగా హాఫ్‌‌‌‌ సెంచరీ సాధించిన బ్యాటర్‌‌‌‌గా ఉర్విల్‌‌‌‌ పటేల్‌‌‌‌ (13 బాల్స్‌‌‌‌), యశస్వి జైస్వాల్‌‌‌‌ (13) సరసన చేరాడు. రాహుల్‌‌‌‌ (14) తర్వాతి ప్లేస్‌‌‌‌లో ఉన్నాడు.