సన్ మళ్లీ ఢమాల్..హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చెన్నై చెక్‌‌‌‌‌‌‌‌

సన్ మళ్లీ ఢమాల్..హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చెన్నై చెక్‌‌‌‌‌‌‌‌
  •     78 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో నెగ్గిన సూపర్‌‌‌‌‌‌‌‌కింగ్స్‌‌‌‌‌‌‌‌

చెన్నై: ఛేజింగ్‌‌‌‌లో మరోసారి తడబడిన సన్‌‌‌‌ రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో మ్యాచ్‌‌‌‌లో ఓడింది. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో రైజర్స్‌‌ చేతిలో ఎదురైన పరాజయానికి చెన్నై సూపర్ కింగ్స్ ప్రతీకారం తీర్చుకుంది. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రుతురాజ్‌‌‌‌‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌‌‌‌‌ (54 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 98), డారిల్‌‌‌‌‌‌‌‌ మిచెల్‌‌‌‌‌‌‌‌ (32 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 52) దంచికొట్టడంతో.. ఆదివారం జరిగిన లీగ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో సీఎస్కే 78 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్‌‌‌‌‌‌‌‌పై నెగ్గింది.

తొలుత చెన్నై 20 ఓవర్లలో 212/3 స్కోరు చేసింది. శివం దూబే (20 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 1 ఫోర్‌‌‌‌‌‌‌‌, 4 సిక్సర్లతో 39 నాటౌట్‌‌‌‌‌‌‌‌) కూడా రాణించాడు. తర్వాత హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ 18.5 ఓవర్లలో 134 రన్స్‌‌‌‌‌‌‌‌కే ఆలౌటైంది. మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌ (32) టాప్‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌.  తుషార్‌‌‌‌‌‌‌‌ దేశ్‌‌‌‌‌‌‌‌పాండే (4/27) నాలుగు వికెట్లతో దెబ్బకొట్టాడు. రుతురాజ్‌‌‌‌‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. 

ఇద్దరే ఆడిన్రు..

టాస్‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన చెన్నైకి సరైన ఆరంభం దక్కలేదు. ఇన్నింగ్స్​ మూడో ఓవర్లోనే భువనేశ్వర్ (1/38).. రహానె (9)ను ఔట్​ చేశాడు. ఈ దశలో రుతురాజ్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ ఆడితే, మిచెల్‌‌‌‌‌‌‌‌ అండగా నిలిచాడు. నాలుగో ఓవర్​లో రెండు ఫోర్లతో టచ్​లోకి వచ్చిన రుతురాజ్‌‌‌‌‌‌‌‌ చివరి ఓవర్‌‌‌‌‌‌‌‌ వరకు క్రీజులో నిలిచాడు. తర్వాతి రెండు ఓవర్లలో మిచెల్ రెండు, రుతురాజ్ రెండు ఫోర్లు కొట్టడంతో పవర్​ప్లేలో చెన్నై 50/1 స్కోరు చేసింది. ఇక్కడి నుంచి రుతురాజ్​ఆట మరో మెట్టు ఎక్కింది. ఫోర్లతో పాటు 9వ ఓవర్​ ఫస్ట్​ బాల్‌‌‌‌‌‌‌‌ను సిక్స్​గా మలిచి 27 బాల్స్​లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. ఇదే ఓవర్​ లాస్ట్ బాల్‌‌‌‌‌‌‌‌కు సిక్స్ కొట్టాడు.  రెండో ఎండ్‌‌‌‌‌‌‌‌లో నటరాజ్‌‌‌‌‌‌‌‌, షాబాజ్‌‌‌‌‌‌‌‌ను లక్ష్యంగా చేసుకుని మిచెల్‌‌‌‌‌‌‌‌ ఫోర్లు బాదాడు.

ఈ క్రమంలో 29 బాల్స్‌‌‌‌‌‌‌‌లో హాఫ్ సెంచరీ సాధించాడు. నిలకడగా ఆడుతున్న ఈ జోడీని 14వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో ఉనాద్కట్(1/38) విడగొట్టాడు. ఫుల్​టాస్​ బాల్‌‌‌‌‌‌‌‌ను భారీ షాట్‌‌‌‌‌‌‌‌ కొట్టబోయి మిచెల్‌‌‌‌‌‌‌‌ డీప్‌‌‌‌‌‌‌‌ మిడ్‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌లో నితీశ్‌‌‌‌‌‌‌‌కు చిక్కాడు. దీంతో రెండో వికెట్‌‌‌‌‌‌‌‌కు107 రన్స్​ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ ముగిసింది. ఆ వెంటనే రెండు సిక్స్‌‌‌‌‌‌‌‌లు, ఫోర్‌‌‌‌‌‌‌‌తో రుతురాజ్​ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను హోరెత్తించడంతో స్కోరు 15 ఓవర్లలో 148/2కు పెరిగింది. 16వ ఓవర్​లో రుతురాజ్​రెండు ఫోర్లు కొడితే తర్వాత ​దూబే 6, 6, 6, 4తో రెచ్చిపోయాడు. 19వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో నటరాజన్ (1/43)స్లో బాల్‌‌‌‌‌‌‌‌ను షాట్‌‌‌‌‌‌‌‌గా మల్చే ప్రయత్నంలో లాంగాన్‌‌‌‌‌‌‌‌లో నితీశ్‌‌‌‌‌‌‌‌కు చిక్కిన రుతురాజ్ కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నాడు. చివర్లో ధోనీ (5 నాటౌట్‌‌‌‌‌‌‌‌) ఫోర్‌‌‌‌‌‌‌‌, దూబే సిక్స్‌‌‌‌‌‌‌‌తో స్కోరు 200లు దాటింది. 

తుషార్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌..

టార్గెట్ ఛేజింగ్‌‌లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ను తుషార్‌‌‌‌‌‌‌‌ దేశ్‌‌‌‌‌‌‌‌పాండే దెబ్బకొట్టాడు. రెండో ఓవర్లో వరుస బాల్స్‌‌‌‌‌‌‌‌లో ట్రావిస్‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌ (13), అన్మోల్‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ (0)ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేసిన అతను నాలుగో ఓవర్లో అభిషేక్‌‌‌‌‌‌‌‌ శర్మ (15)ను పెవిలియన్‌‌‌‌‌‌‌‌కు పంపాడు. ఫలితంగా సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్‌‌‌‌‌‌‌‌ 40/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌, నితీశ్‌‌‌‌‌‌‌‌ (15) జాగ్రత్తగా ఆడి 53/3 స్కోరుతో పవర్‌‌‌‌‌‌‌‌ప్లేను ముగించారు. ఈ ఇద్దరూ నిలకడగా ఆడే ప్రయత్నం చేసినా జడేజా (21/22) టర్నింగ్‌‌‌‌‌‌‌‌ బాల్స్‌‌‌‌‌‌‌‌తో ఇబ్బంది పెట్టాడు. తన తొలి ఓవర్‌‌‌‌‌‌‌‌లో ఆరు రన్సే ఇచ్చిన జడ్డూ రెండో ఓవర్లోనే నితీశ్‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌ తీయడంతో సగం ఓవర్లకు రైజర్స్‌‌‌‌‌‌‌‌ 78/4 స్కోరుకే పరిమితమైంది.

ఆపై, పతిరణ (2/17) వచ్చి రావడంతోనే అద్భుతమైన ఇన్‌‌‌‌‌‌‌‌స్వింగ్‌‌‌‌‌‌‌‌ యార్కర్‌‌‌‌‌‌‌‌తో మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌ను క్లీన్‌‌‌‌‌‌‌‌బౌల్డ్‌‌‌‌‌‌‌‌ చేయడంతో ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ 85 రన్స్‌‌‌‌కే సగం వికెట్లు కోల్పోయింది. ఇక్కడి నుంచి క్లాసెన్‌‌‌‌‌‌‌‌ (20), సమద్‌‌‌‌‌‌‌‌ (19)ను హిట్టింగ్‌‌‌‌‌‌‌‌ చేయకుండా చెన్నై బౌలర్లు అడ్డుకోవడంతో రన్‌‌‌‌‌‌‌‌ రేట్‌‌‌‌‌‌‌‌ పడిపోయింది. ఇక 30 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 104 రన్స్‌‌‌‌‌‌‌‌ చేయాల్సిన దశలో నాలుగు బాల్స్‌‌‌‌‌‌‌‌ తేడాలో  క్లాసెన్‌‌‌‌‌‌‌‌, సమద్‌‌‌‌‌‌‌‌.. ఆ వెంటనే కమిన్స్‌‌‌‌‌‌‌‌ (5), షాబాజ్‌‌‌‌‌‌‌‌ (7), ఉనాద్కట్‌‌‌‌‌‌‌‌ (1) వెనుదిరగడంతో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ భారీ తేడాతో ఓటమిపాలైంది.