కాంగ్రెస్​కు చెరుకు సుధాకర్​ రాజీనామా

కాంగ్రెస్​కు చెరుకు సుధాకర్​ రాజీనామా

హైదరాబాద్​, వెలుగు: కాంగ్రెస్​ పార్టీకి చెరుకు సుధాకర్​ రాజీనామా చేశారు. పార్టీలో ఉద్యమకారులు, బీసీ లీడర్లకు గుర్తింపు లేకుండా పోతున్నదని అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన తన రాజీనామా లేఖను పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డికి పంపించారు. ‘‘ఓవైపు ఓబీసీ కోటా, మహిళా రిజర్వేషన్లు, బీసీ కులగణన గురించి రాహుల్​ గాంధీ పార్లమెంట్​లో మాట్లాడుతుంటే.. మరోవైపు రాష్ట్ర పార్టీలో మాత్రం ఆధిపత్య కులాల కంపు మా లాంటి బీసీ లీడర్లకు ఊపిరాడనివ్వకుండా చేస్తున్నది. పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్​ మధుయాష్కీ స్థాయిని ప్రణాళిక ప్రకారం ఎట్లా తగ్గిస్తున్నరో.. అదే సమయంలో ఆర్థికంగా బలవంతుడైన పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి లాంటి వాళ్లకు ప్రాధాన్యం ఎట్లా పెంచుతున్నరో అందరికీ తెలుసు” అని కామెంట్​ చేశారు.

‘‘నా  విషయంలో కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి విపరీత ప్రవర్తనను పార్టీ నాయకత్వం నిలువరించలేకపోయింది. నేను పనిచేస్తున్న నకిరేకల్​ నియోజకవర్గంలో కనీసం నాకు సమాచారమైనా ఇవ్వకుండా వేముల వీరేశంను అభ్యర్థిగా ప్రకటించడం దేనికి సంకేతమో చెప్పాలి” అని ఆయన డిమాండ్​ చేశారు. తన విషయంలో కోమటిరెడ్డి వెంకట్​రెడ్డిని రేవంత్​, ఉత్తమ్​, జానారెడ్డి  నిలువరించే ప్రయత్నమే చేయలేదన్నారు.