హైదరాబాద్, వెలుగు: సమ్మక్క సాగర్ బ్యారేజీ బ్యాక్ వాటర్ ముంపుపై సర్వే చేయించేందుకు నిధులు ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని చత్తీస్ గఢ్ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు ఇటీవల చత్తీస్ గఢ్ ఇరిగేషన్ సెక్రటరీ లేఖ రాశారు. నిరుడు సెప్టెంబర్ 22న జరిగిన మీటింగ్లో.. ముంపు సర్వేకి నిధులు ఇచ్చేందుకు ఒప్పుకున్నారని గుర్తు చేశారు.
సమ్మక్క సాగర్ బ్యారేజీ బ్యాక్ వాటర్ తో బీజాపూర్ జిల్లాలోని పలు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఆ ముంపును తేల్చేందుకు సర్వే కోసం రూ.9.88 కోట్లు ఖర్చు అవుతాయని, ఆ నిధులను వెంటనే మంజూరు చేస్తే సర్వే మొదలుపెడతామని తెలిపారు.
